జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా పనులు
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలోని సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, పంపింగ్ వెల్ నిర్మాణాలకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. అలాగే, 15వ డివిజన్ పాఠశాలలో పూర్తయిన అదనపు తరగతి గదులు, 55వ డివిజన్ బ్యాంక్ కాలనీలో సీసీ డ్రెయిన్, కల్వర్టులు, 12వ డివిజన్ లకారం ట్యాంక్‌బండ్ వద్ద నేతాజీ పార్క్‌ను ప్రారంభించడమే కాక అల్లీపురంలో 9 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్, డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వ్యవస్థను ప్రారంభించారు. ఆతర్వాత అల్లీపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నలభై ఏళ్ల ప్రజాసేవలో పల్లెపల్లెకు రహదారులు, తాగునీటి సదుపాయం, విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తూనే భారీ ప్రాజెక్టులను తీసుకొచ్చానని పేర్కొన్నారు. తద్వారా ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తున్నానని తెలిపారు. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ తొలిసారి అల్లీపురంలో 24 గంటల తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. మంత్రి తుమ్మల సహకారంతో టీటీడీ ఆధ్వర్యాన ఆలయ నిర్మాణం, మెడికల్ కాలేజీ, ఖమ్మం ఖిల్లాకు రోప్‌వే తదితర పనులు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం సుడా చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖాదర్‌అలీతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరాను సన్మానించారు. కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో పాటు రావూరి కరుణసైదబాబు, కమర్తపు మురళి, సైదబాబు, ఎస్.నాగేశ్వరరావు, పి.వెంకటేశ్వరరావు, నాగండ్ల దీపక్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.


