తాగునీటి ఎద్దడి రాకుండా పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి రాకుండా పర్యవేక్షణ

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

ఖమ్మం అర్బన్‌: వేసవి నేపథ్యాన జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. తాగునీటి సరఫరా కార్యాచరణపై అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజతో కలిసి కలెక్టరేట్‌లో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించాని సూచించారు. అధికారులు కూడా కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారం, సరఫరాను ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు పరిమితం చేయకుండా ఎంపీడీఓలు, ఎంపీఓలతో పాటు పంచాయతీ కార్యదర్శులు, స్థానిక సంస్థల అధికారులు బాధ్యతగా భావించాలని సూచించారు. మిషన్‌ భగీరథ నీటిని వినియోగిస్తూ, అవసరమైతే స్థానిక వనరులను వినియోగించుకోవాలని చెప్పారు. ఆతర్వాత బోర్లు, చివరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని తెలిపారు. వేసవి దృష్ట్యా పోలీస్‌ స్టేషన్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులతో పాటు పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అంతేకాక గ్రామాలు, పట్టణాల్లో వీధి జంతువులు, పక్షుల కోసం నీటి గుంతలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఇంకా ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, డీఎంహెచ్‌ఓ రామారావు, డీపీఓ రాంబాబు, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి, ఈఈలు పుష్పలత, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దివాకర టీఎస్‌

Advertisement
 
Advertisement
Advertisement