ఒడిదుడుకుల వంటలు.. | - | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల వంటలు..

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

గ్యాస్‌ కొరత వేధిస్తోంది..

వంట చెరకు లభ్యత తగ్గింది

శుభకార్యాల వేళ వంటలకు

ఇబ్బందులు

అంతరిస్తున్న అడవులతో

తగ్గిన వంట చెరకు లభ్యత

ఫలితంగా పెరిగిన డిమాండ్‌, ధరలు

ఖమ్మం గాంధీచౌక్‌: ఓ పక్క గ్యాస్‌ కొరత.. మరో పక్క వంట చెరకు సరిపడా లభ్యత లేకపోవడంతో హోటళ్ల రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే జిల్లాలోని పలు చిన్న హోటళ్లను నిర్వాహకులు మూసివేయగా.. మరికొందరు ధరలు పెంచారు. వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం, అయినా సరిపడా లభించక బ్లాక్‌లో కొనాల్సి రావడం.. ఇవి కాకపోతే కలప కొనాలన్నా లభ్యత లేక ధరలు పెరగడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇదే సమయాన శుభకార్యాల సీజన్‌ కావడంతో పెళ్లిల్లు, గృహ ప్రవేశాలు ఇతర వేడుకల్లో వంటల తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నారు. క్యాటరింగ్‌ నిర్వాహకులు ఎక్కువగా గ్యాస్‌ ఆధారంగానే వంటలు చేస్తుండగా.. ప్రస్తుతం కొరతతో సమస్య ఎదుర్కొంటున్నారు.

కేటరింగ్‌ అష్టకష్టాలు

శుభకార్యాలు, ఇతర కార్యాలకు భోజనాలు, అల్పాహారాలు తయారు చేసి కేటరింగ్‌ సంస్థల బాధ్యులు కూడా గ్యాస్‌ సిలిండర్ల లభించక ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్ల కొరతతో కొన్ని ఆర్డర్లు వదిలేసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరికొందరు ధరలు పెంచుతుండడం గమనార్హం.

వంట చెరకు లభించక..

గ్యాస్‌కు కొరత ఏర్పడడంతో ప్రత్యామ్నాయంగా వంటచెరకు వినియోగిస్తున్నారు. అయితే అంతరించిపోతున్న అడవులతో వంటచెరకు కూడా అంతంత మాత్రంగానే లభిస్తోంది. సా మిల్లుల్లో వృథాగా మిగిలే కలపను వంట చెరకుగా వినియోగిస్తున్నా... తుమ్మ, వేప వంటివి ఉపయోగపడుతున్నాయి. కానీ ఈ రకం వృక్షాలు అడవులు, బీడు భూముల్లో అంతరించడంతో కొరత నానాటికీ పెరుగుతోంది. గ్యాస్‌ ఇబ్బందులు రాకముందు వంటచెరకు క్వింటా ధర రూ.650 వరకు ఉండగా.. ఇప్పుడు అది రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు పలుకుతోంది. బిర్యానీ తదితరాల తయారీకి వంట చెరకు తప్పనిసరి కావడం.. కానీ లభ్యత లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మరోపక్క గ్యాస్‌ కొరతతో అన్ని వంటలను ఖర్చు భరించి వంట చెరకుతో చేయడానికి సిద్ధమైనా పొగ కారణంగా వంట మాస్టర్లు, కూలీలు రావడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు.

అవసరం మేర గ్యాస్‌ లభించక కేటరింగ్‌ ఆర్డర్లు తీసుకోవాలంటే భయమేస్తోంది. మరోపక్క వంటల తయారీకి అనువైన కలప లభించటం లేదు. ఇలా రెండు రకాల ఇబ్బందులతో కొన్ని ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నాం. – మట్టా గణేష్‌,

క్యాటరింగ్‌ నిర్వాహకులు, ఖమ్మం

వంటలకు వేప, తుమ్మ వంటి కలపే వినియోగిస్తారు. కానీ అడవులు తగ్గడంతో ఆ కలప లభించడంలేదు. దీంతో టేకు రీపర్లు, వృథా సామగ్రి తీసుకెళ్తున్నారు. కొందరు వంటచెరుకు కోసం ముందే బుక్‌ చేసుకుంటున్నారు. – బాసా మల్లికార్జున్‌,

సామిల్‌ – టింబర్‌ డిపో, ఖమ్మం

గ్యాస్‌ దొరకదు..

కలప లేదు...

Advertisement
 
Advertisement
Advertisement