కర‘కట్టా’లు తీరేనా?
ఎండా, వానా రెండూ ఎక్కువే
భద్రగిరిలో గోదావరి కరకట్టపై నిలువ నీడ కరువు
● ఇరవై ఏళ్లుగా పెద్దగా మార్పునకు నోచుకోని వైనం ● సోలార్ ప్యానళ్ల రూఫ్‌టాప్ ఏర్పాటుచేస్తే నీడతో పాటు గ్రీన్ ఎనర్జీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మార్చి రాకముందే ఎండలు మండుతున్నాయి. భద్రాచలంలో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 36 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైంది. ఆలయ ప్రాంగణంతో పాటు గోదావ రి తీరం, కరకట్ట వద్ద జనసంచారం తగ్గిపోయింది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేలా మాస్టర్‌ప్లాన్‌లో పనులను చేర్చాల్సిన అవసరం ఉంది.
రెండు దశాబ్దాలుగా
గోదావరి వరదల నుంచి భద్రాచలానికి రక్షణ కల్పించేందుకు 20 ఏళ్ల కిందట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న యటపాక నుంచి భద్రాచలం మీదుగా సుభాష్‌నగర్ వరకు సుమారు 7.5 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించారు. ఇందులో గోదావరిపై నిర్మించిన వంతెన దగ్గర నుంచి ఆంజనేయస్వామి విగ్రహం మీదుగా సీడబ్ల్యూసీ ఫ్లడ్ మెజర్‌మెంట్ పాయింట్, స్నానఘట్టాలు, గోదావరి మాత విగ్రహం, గంగమ్మ తల్లి గుడి వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర కరకట్టపై సిమెంట్ రోడ్డు నిర్మించారు. దిగువ భాగంలో రామాయణ ఇతివృత్తాన్ని తెలిపేలా విగ్రహాలు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత చెప్పుకోదగిన మార్పులు, అభివృద్ధి జరగలేదు. సోలార్ విద్యుత్..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు వెంట 23 కిలోమీటర్ల మేర సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఈ ట్రాక్ నిర్మాణానికి రూ.35 కోట్లు ఖర్చు కాగా, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14 మెగావాట్లుగా ఉంది. ఇదే తరహాలో గోదావరి కరకట్ట పైభాగంలో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసేలా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల్లో చేర్చాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా కరకట్టపై నీడ రావడమేకాక విద్యుత్ ఉత్పత్తితో ఆలయానికి అదనపు ఆదాయం సమకూరుతుంది.
మాస్టర్ ప్లాన్‌లో చోటు కల్పిస్తే..
ఏటా భద్రాచలం వచ్చే భక్తులు, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్ట్యా భద్రాచలంలో చేపట్టే పనులకు మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఈ మాస్టర్ ప్లాన్‌లో గోదావరి కరకట్ట వెంట సోలార్ రూఫ్ ప్యానల్‌కు చోటు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
వేసవిలో రాష్ట్రంలోనే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రాచలం ఒకటి. ముఖ్యంగా శ్రీరామనవమి సమయంలో ఇక్కడ ఎండలు భగ్గుమంటాయి. గోదావరి తీరంలో పవిత్రస్నానం చేసేందుకు వచ్చే భక్తులకు నిలువ నీడ లేదు. ఏటా మార్చి/ఏప్రిల్‌లో నవమి సందర్భంగా భద్రాచలం వచ్చే భక్తులు నిలువ నీడ లేక అల్లాడిపోతుంటారు. ఇక ఏజెన్సీలో వానలు కూడా ఎక్కువే. దీంతో ఇటు వర్షాకాలం, అటు ఎండాకాలంలో వచ్చే భక్తులు కరకట్ట దగ్గర ఎక్కువ సేపు గడిపే వీల్లేకుండా పోతోంది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేలా గోదావరి వంతెన నుంచి కనీసం సుభాష్‌నగర్ కాలనీ వరకైనా కరకట్ట పై భాగంలో సోలార్ ప్యానళ్లతో రూఫ్ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.


