ప్రాజెక్ట్‌కు ప్రశంసలు !
● ఖమ్మంలో 24గంటల నీటి సరఫరాకు ‘టైటాన్’ అవార్డు ● స్టార్టప్ కంపెనీకి రూ.50 లక్షల గ్రాంట్
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 24గంటల పాటు తాగునీటి సరఫరా పైలట్ ప్రాజెక్టుకు ప్రశంసలు దక్కాయి. సాంకేతికత సాయంతో అమలుచేస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడమే కాక, ఇందులో భాగస్వామ్యమైన స్టార్టప్ కంపెనీకి టైటాన్ గ్రూప్ నుండి భారీ ప్రోత్సాహం అందింది. ఖమ్మంలో నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేఎంసీ అధికారులు ‘స్మార్ట్ టెరా’ స్టార్టప్ కంపెనీతో ఒప్పందం చేసుకొని అమలుచేస్తున్నారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని గుర్తించిన టాటా గ్రూప్ సంస్థల్లో ఒకటైన టైటాన్.. స్టార్టప్ కంపెనీకి రూ.50 లక్షల గ్రాంట్ మంజూరు చేసింది. అలాగే, కేఎంసీకి అవార్డు అందజేసింది.
ఏఐ సాంకేతికతతో లీకేజీలకు చెక్
నగరంలోని రెండు ప్రాంతాల్లో 24గంటల పాటు తాగునీటి సరఫరా చేసేలా కేఎంసీ అధికారులు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. అల్లీపురంతో పాటు రోటరీనగర్‌లో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టగా, రోటరీనగర్‌లో స్మార్ట్ టెరా స్టార్టప్ కంపెనీతో కలిసి చేపట్టారు. ఇందులో ఏఐ ఆధారంగా లీక్ డిటెక్షన్ సిస్టమ్‌ను ఉపయోగించడం ద్వారా భూగర్భంలోని పైపులైన్లలో ఎక్కడైనా నీటి లీకేజీలు ఉన్నా సమర్థవంతంగా గుర్తించి అరికట్టారు. నిర్దిష్ట డిస్ట్రిక్ట్ మీటర్డ్ ఏరియా(డీఎంఏ)లో గతంలో 90శాతం ఉన్న నీటి వృథా ప్రస్తుతం 15 శాతానికి తగ్గింది. ఫలితంగా వేలాది లీటర్ల స్వచ్ఛమైన నీరు వృథా కాకుండా ప్రజలకు చేరుతోంది.
బెంగళూరులో సదస్సు
బెంగళూరులో టైటాన్ గ్రూప్ ఆధ్వర్యాన డిజైన్ ఇంపాక్ట్ అవార్డ్స్ వేడుక నిర్వహించారు. ఇందులో ఖమ్మం ప్రాజెక్టు సాధించిన అద్భుత ఫలితాలకు గాను ప్రతిష్టాత్మక అవార్డు అందజేశారు. సామాన్యుల అవసరాల కోసం సాంకేతికతను వినియోగించడంలో కేఎంసీ చూపిన చొరవను కొనియాడారు. కేఎంసీకి రూ.50 లక్షలతో సాంకేతికత అందించిన స్టార్టప్ కంపెనీకి రూ.50 లక్షల గ్రాంట్ మంజూరు చేయడంతో ఖమ్మం కార్పొరేషన్‌పై ఆర్థిక భారం తప్పింది.
నగరవ్యాప్తంగా విస్తరణ
పైలట్ ప్రాజెక్ట్‌గా రెండు ప్రాంతాల్లో 24గంటల పాటు తాగునీటి సరఫరా విధానాన్ని బెంగళూరు వేదికపై కేఎంసీ ఎస్‌ఈ వేముల రంజిత్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తొలుత రెండు ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టుకు వస్తున్న మంచి ఫలితాలతో నగరంలోని మిగిలిన ప్రాంతాలకు వర్తింపచేయాలనే సన్నాహాల్లో ఉన్నట్లు తెలిపారు. ఇది అమలైతే ఖమ్మం నగరమంతా నిరంతరాయంగా, వృథా లేకుండా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుంది.


