ఫార్మర్‌ రిజిస్ట్రీలో ఫస్ట్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ఫస్ట్‌ !

Mar 1 2026 7:31 AM | Updated on Mar 1 2026 7:31 AM

ఫార్మ

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ఫస్ట్‌ !

జిల్లాలో 2,33,962 మంది

రైతుల నమోదు

30వ స్థానాన నిలిచిన భద్రాద్రి జిల్లా

ఏఈఓలు, మీ–సేవ ద్వారా రిజిస్ట్రేషన్‌కు అవకాశం

ప్రాధాన్యతను గుర్తించాలి..

ఖమ్మంవ్యవసాయం: ఫార్మర్‌ ఐడీ(రైతు గుర్తింపు) రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియలో 75.59శాతం పూర్తి చేయడం ద్వారా జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలిచింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్‌ చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించి న ఫార్మర్‌ ఐడీ(ఫార్మర్‌ రిజిస్ట్రీ) ప్రాజెక్టు 5మే 2025 న ప్రారంభమైంది. మండలాల్లో క్లస్టర్ల వారీగా ఏఈఓల ద్వారానే కాక మీ సేవా కేంద్రాల్లో ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియ కొనసాగుతోంది. నిబంధనల మేర కు జిల్లాలో 3,39,832 మంది రైతులు అర్హులు కాగా, ఇందులో ఫిబ్రవరి 27వ తేదీ నాటికి 2,33,962 మంది రైతులు ఐడీకి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

భద్రాద్రి జిల్లాకు 30వ స్థానం

రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ కొనసాగుతోంది. ఈమేరకు ఖమ్మం జిల్లా మొదటి స్థానాన నిలిచింది. ఇక 75.25 శాతంతో పెద్దపల్లి జిల్లా రెండో స్థానం, 72.06 శాతంతో సిద్ధిపేట మూడో స్థానంలో, 71.77 శాతం పూర్తి చేసిన వరంగల్‌ జిల్లా నాలుగో స్థానంలో, 71.18 శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఐదో స్థానాన నిలిచాయి. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవలం 53.61 శాతమే నమోదు పూర్తి కావడంతో 30వ స్థానానికి పరిమితమైంది.

రిజిస్ట్రీ ఆధారంగా కేంద్ర పథకాలు

కేంద్రప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన, సాయిల్‌ హెల్త్‌ కార్డు, ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, భారత ఆహార భద్రత మిషన్‌, రాష్ట్రీయ కృషి వికాస యోజన తదితర పథకాలను అమలుచేస్తోంది. ఇవి అర్హులకు అందడానికి ఐడీ కార్డు కీలకం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రిజిస్ట్రేషన్‌ కలిగిన వారికే కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతాయనే అంశాన్ని వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఈమేరకు రైతులకు ఉన్న భూమి వివరాలను సర్వే నంబర్ల వారీగా నమోదు చేయడమే కాక భూమి రకం, సాగు చేసే పంటలను కూడా పొందుపరుస్తారు. డిజిటల్‌ విధానంలో జిల్లాలోని 129 క్లస్టర్లలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

మార్చి 15 వరకు అవకాశం

ఫార్మర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌కు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాలను పొందుతున్న రైతులు, అర్హత ఉండి పథకాలను పొందలేకపోతున్న రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఐడీ కేటాయిస్తారు. ప్రతీ క్లస్టర్‌లోని రైతు వేదికల్లో ఏఈఓలను పూర్తి వివరాలతో సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు.

ఫార్మర్‌ ఐడీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఐడీ ఆధారంగానే కేంద్రప్రభుత్వ పథకాలు అందుతాయని రైతులు గుర్తించాలి. నిర్దేశిత గడువులోగా ఏఈఓలను కానీ మీ–సేవా కేంద్రాల్లోనైనా సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. తద్వారా 11 అంకెలతో కూడిన గుర్తింపు కార్డు వస్తుంది.

– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ఫస్ట్‌ !1
1/1

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ఫస్ట్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement