పరిహారం లేదు.. అనుమతీ రాలేదు!
● నిర్వాసితుల భూముల్లో శ్రీగంధం చెట్ల తొలగింపు ● సింగరేణి తీరుతో బాధితుల ఆందోళన
సత్తుపల్లి: రోడ్డు నిర్మాణానికి భూమి సేకరిస్తుండగా, భూయజమానులకు పరిహారం చెల్లించకుండానే విలువైన శ్రీగంధం, మలబార్, టేకు చెట్లను అధికారులు తొలగించడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈమేరకు రెండు రోజులుగా రోడ్డు పనులను అడ్డుకుని నిరసన తెలుపుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. సత్తుపల్లి మండలంలో సింగరేణి ఓపెన్‌కాస్టు విస్తరణలో భాగంగా విజయవాడవైపు వెళ్లే రోడ్డును సంస్థ స్వాధీనం చేసుకుంది. ఆపై కొన్నేళ్ల క్రితం సత్తుపల్లి – రేజర్ల డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ కోసం సిద్ధమయ్యారు. ఈక్రమాన ఐదుగురు రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, కొందరు కోర్టును ఆశ్రయించడంతో అవరోధం ఏర్పడింది.
పరిహారం ఇవ్వండి
పలువురు రైతులు కోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం బాధితులకు భూమితో పాటు అందులోని చెట్లకు సరైన రీతిలో పరిహారం చెల్లించాక స్వాధీనం చేసుకోవాలని తీర్పు వెలువరించింది. ఈమేరకు రేజర్ల రెవెన్యూ పరిధి 156, 116, 117, 118 సర్వేనంబర్లలో ఎస్‌కే.ఖాదర్‌పాషాకు చెందిన 2.5 ఎకరాల భూమి ఉంది. ఇందులో శ్రీగంధం, మలబార్, టేకు చెట్లను పెంచుతున్నారు. గత 12ఏళ్ల క్రితం నాటిన ఈ మొక్కలు వృక్షాలుగా మారాయి. శ్రీగంధం చెట్లను అటవీశాఖ అనుమతి లేకుండా నరకడంపై నిషేధం ఉన్నా రాత్రికి రాత్రే చెట్లను తొలగించి రోడ్డును చదును చేయడంపై పట్ల రైతులు లబోదిబోమంటున్నారు.
లెక్క కట్టక ముందే..
భూపరిహారంతో పాటు అందులోని చెట్ల విలువను లెక్కకట్టి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఎస్‌కే.ఖదీర్‌పాషాకు చెందిన ఎకరం భూమిలో 520 శ్రీగంధం చెట్లు, 30 మలబార్ చెట్లు, ఐదు టేకు చెట్లు ఉన్నట్లు అటవీశాఖ తేల్చింది. వీటి ధరను ఆర్డీఓ, సింగరేణి, అటవీశాఖ అధికారులతో కూడిన కమిటీ నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో శ్రీగంధం, మలబార్ చెట్లు లేకపోవడంతో ధర నిర్ణయం కోసం అటవీశాఖ ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి ధరలను తెప్పించే పనిలో ఉండగానే చెట్లను తొలగించడం గమనార్హం. ముప్ఫై ఏళ్లుగా సాగులో ఉన్న తోటలు కావడంతో న్యాయమైన పరిహారం నిర్ణయించాలని ఖదీర్‌పాషా అధికారులకు పలుమార్లు కలిసి విన్నవించాడు. ఇదంతా పరిశీలన దశలో ఉండగానే చెట్ల తొలగించడంపై ఖదీర్‌తో పాటు మరికొందరు పనులను అడ్డుకుని నిరసన తెలుపుతున్నా ఫలితం కానరావడం లేదు. ఈ విషయమై సత్తుపల్లి ఎఫ్‌డీఓ వి.మంజులను వివరణ కోరగా.. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా అనుమతి లేకుండా శ్రీగంధం, మలబార్, టేకు చెట్లను తొలగించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై విచారణ చేస్తూనే సింగరేణి ఏజెన్సీకి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.
పరిహారం లేదు.. అనుమతీ రాలేదు!


