ఆకట్టుకున్న ఈసీఆర్ పాట !
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో ఇంగ్లిష్ చదవడం, రాసే సామర్థ్యాలు పెంచేలా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్)’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. ఇందుకోసం ప్రతిరోజు సాయంత్రం గంట సమయం కేటాయిస్తుండగా మొదటి దశ విజయవంతం కావడంతో రెండో దశ ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ కూడా సమకూర్చడంతో మంచి ఫలితాలు వస్తుండడంపై విద్యార్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దీంతో వారు తమ సంతోషాన్ని చాటేందుకు గణతంత్ర దినోత్సవాన్ని వేదికగా చేసుకున్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఖమ్మం సంభానినగర్ ప్రాథమిక పాఠశాల, కొత్తగూడెం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు పేరెంట్ కమ్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) ఫ్లెక్సీతో పాటు కలెక్టర్ అనుదీప్ ఫొటోను ప్రదర్శిస్తూ చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమ లక్ష్యం నెరవేరి విద్యార్థులు ఇంగ్లిష్ మాట్లాడుతుండడమే కాక నృత్యం చేయడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేయగా, నృత్యం సాగుతున్నంత సేపు అధికారులు, సిబ్బంది చప్పట్లతో అభినందించారు. కాగా, కొత్తగూడెం స్కూల్ ఉపాధ్యాయుడు బండి నాగేశ్వరరావు ఈ పాటను రచించగా, సంభానీనగర్ ఉపాధ్యాయురాలు టి.సూర్యకుమారి, శాంతినగర్ హైస్కూల్ హెచ్‌ఎం బాలానందం విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చారు.
కలెక్టర్ అనుదీప్ ఫొటోతో విద్యార్థుల నృత్యం


