● ‘సుఫల యాత్ర’తో ఆరోగ్య, వ్యవసాయ ఉద్యమం ● రేపు నేలకొండప
అందరి ఆరోగ్యం కోసమే పాదయాత్ర
నేలకొండపల్లి: ఆరోగ్య వంతమైన సమాజస్థాపన కోసం ప్రజలకు అవగాహన కల్పించేలా రెండు తెలుగు రాష్ట్రాల్లో చినజీయర్‌స్వామి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి రామదాసు ధ్యాన మందిరం వరకు ఆయన మంగళవారం యాత్ర నిర్వహిస్తారు. ఈమేరకు ఏర్పాట్లను ఆయన కార్యదర్శి భవానీప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న కాలుష్యం, రసాయనాలు వాడకంతో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతింటున్నందున వీటి నుంచి ప్రజలను కాపాడేలా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు స్వామి పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు.
ఇక్కడే ఎందుకు.....
నేలకొండపల్లిలో సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యాన కొన్నాళ్లుగా ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేస్తున్నారు. అంతేకాక భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న(భక్తరామదాసు) జన్మస్థలం కూడా ఇదే కావడంతో చినజీయర్ ఈ ప్రాంతాన్నియాత్ర ప్రారంభానికి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నేలకొండపల్లిలో తొలుత యాత్ర నిర్వహించాక ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని నిర్ణయించారని చెబుతున్నారు. కాగా, సోమవారం నేలకొండపల్లికి రానున్న చినజీయర్ స్వామి తొలుత రాజేశ్వరపురంలో రామమందిరాన్ని సందర్శిస్తారు. అలాగే, ఆయన వద్ద 30ఏళ్లగా పనిచేస్తున్న రాజేశ్వరపురం వాసి గోపాలకృష్ణ నివాసానికి వెళ్తారు. ఆ ర్వావాత నేలకొండపల్లిలోని సిద్ధార్ధ యోగా విద్యాలయానికి చేరుకుని బస చేస్తారు. ఇక 20న ఉదయం వివిధ రకాల ఔషధ వరి, చిరుధాన్యాలు, దేశీవాళీ పప్పు దినుసులు, గోవులు, ఔషధ మొక్కల ప్రదర్శనను పరిశీలించాక రామదాసు ధ్యానమందిర వద్దకు పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈమేరకు యోగా విద్యాలయం, రామదాసు ధ్యానమందిరం వద్ద ఏర్పాట్లను చినజీయర్ స్వామి ప్రత్యేక కార్యదర్శి భవానీప్రసాద్ పరిశీలించారు. వ్యవసాయ, ప్రకృతి వైద్య ప్రేమికులు, యోగా కేంద్రాల నిర్వాహకులు, ప్రజలు పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు. రాజేశ్వరపురం సర్పంచ్ దండా రంగయ్యతో పాటు దండా నరసింహారావు, బొనగిరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


