కమ్యూనిస్టులంటే దేశ భక్తులు | - | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టులంటే దేశ భక్తులు

Jan 18 2026 7:03 AM | Updated on Jan 18 2026 7:03 AM

కమ్యూ

కమ్యూనిస్టులంటే దేశ భక్తులు

● వందేళ్ల సీపీఐ ప్రస్థానంలో అనేక అనుభవాలు ● నేడు లక్షలాది మంది పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభ ● దేశ, విదేశాల నుంచి హాజరుకానున్న ప్రతినిధులు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు

అందుకే తెలంగాణకు సపోర్ట్‌..

● వందేళ్ల సీపీఐ ప్రస్థానంలో అనేక అనుభవాలు ● నేడు లక్షలాది మంది పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభ ● దేశ, విదేశాల నుంచి హాజరుకానున్న ప్రతినిధులు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘నిర్బంధాల్లో పుట్టిన కమ్యూనిస్టు పార్టీ జైలులో పురుడుపోసుకుంది. 1925 డిసెంబర్‌ 26న కాన్పూరు వేదికగా ఆవిర్భవించిన సీపీఐలో నాయకులు త్యాగాలు చేయడమే కాక జైలు శిక్ష అనుభవించడంతో పాటు వీరమరణం పొందారు. దేశం, ప్రజల కోసం పోరాడి మరణించినవాళ్లు ఏ పార్టీలో ఉండరు. అందుకే కమ్యూనిస్టులంటే దేశ భక్తులు. అలాంటి పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఖమ్మంలో నిర్వహిస్తున్నాం. కమ్యూనిస్టు ఉద్యమాలకు ఖమ్మం కీలకం కావడం, రెండు రాష్ట్రాలే కాక వివిధ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుండడం, రవాణా సౌకర్యం ఉండడంతో ఈ వేదిక ఎంచుకున్నాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఏర్పాట్లపై శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే..

లక్షలాది మందితో..

నాలుగు రోజుల పాటు జరిగే ఈ సభలకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. తొలి రోజైన ఆదివారం బహిరంగ సభకు లక్షలాది మంది తరలివస్తున్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ మైదానంలో ఏ మూలన కూర్చున్నా వక్తల ప్రసంగం వినిపించేలా ఎల్‌ఈడీ తెరలు పెట్టించాం. వందేళ్ల సభ నేపథ్యాన పార్టీ శ్రేణుల్లో ఎప్పుడూ లేనంత సంతోషం కనిపిస్తోంది.

ప్రముఖ నేతల రాక

శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 20న సెమినార్‌ ఏర్పాటు చేశాం. ఈ సెమినార్‌లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, ఆర్‌ఎస్పీ, ఏఐఎఫ్‌బీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఎంఏ.బేబి, దీపాంకర్‌ భట్టాచార్య, మనోజ్‌ భట్టాచార్య, జి.దేవరాజన్‌.. ఇలా ఐదు లెప్ట్‌ పార్టీల నుంచి ముఖ్య నేతలు ప్రసంగిస్తారు. ‘భారత దేశ పరిస్థితులు–వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై ఈ సెమినార్‌ కొనసాగుతుంది. ఆదివారం బహిరంగ, 19న సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశం, 20న సెమినార్‌, 21న జాతీయ కౌన్సిల్‌ సమావేశంతో సభలు ముగుస్తాయి. తొలి రోజు సభకు సీపీఐ జాతీయ, రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరవుతారు.

కమ్యూనిస్టులు ఒకటవాలి..

సీపీఐ వందేళ్ల ప్రస్థానంలో అనేక అనుభవాలున్నాయి. ఈ కాలంలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే, ఇంకొన్ని రాష్ట్రాల్లో రాలేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టు పార్టీనే. అప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ లేవు. అయితే, కమ్యూనిస్టులు, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం పూర్తిగా భిన్నమైనది. ఆర్‌ఎస్‌ఎస్‌ గిరి గీసుకొని మతం పేరుతో దేశంలో ఉద్రిక్తతలను పెంచుతోంది. కమ్యూనిస్టులుగా మేం మాత్రం మతమైనా, దేవుడైనా ఎవరి విశ్వాసాలకు భంగం కలగవద్దని, అందరూ కలిసి ఉండాలని చెబుతున్నాం. అనునిత్యం ప్రజల్లో ఉంటున్నందునే కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు క్రియాశీలకంగా ఉంది. అనేక పార్టీలు పుట్టాయి, పోయాయి, కానీ కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికీ ఉంటుంది. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట పరిశ్రమల్లో కార్మికులు ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు దేశంలో ఉన్న సవాళ్లను ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులు ఒకటవ్వాలి. కార్మిక వర్గం ఒక్కటై ఉద్యమాలు మరింత పెంచితే ప్రజల్లో ఉత్సాహం రావడంతో పాటు కార్మికులకు న్యాయం జరుగుతుంది. తొలుత సీపీఐ, సీపీఎం కలిస్తే.. ఆ తర్వాత మిగతా పార్టీలు కలవడానికి వీలుంటుంది.

పెరుగుట విరుగుటకే..

ఎస్‌ఐఆర్‌ పేరుతో దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో లక్షల ఓట్లను బీజేపీ ప్రభుత్వం తొలగిస్తోంది. ఈ క్రమాన బీజేపీ ఇష్టారీతిన వ్యవహరిస్తోంది. పెరుగుట విరుగుటకే అన్నట్లుగా బీజేపీ వాళ్లు ఎంత పెరిగినట్లు చూపించుకుంటున్నా చివరకు ప్రజల చేతిలో పరాభవం తప్పదు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓట్లు తీసేస్తున్నారు. కొన్నేళ్లుగా ఉన్న ఊరిలో ఉన్న ఓటర్లు కూడా ఏదో ఒకటి సమర్పించాలని చెబుతున్నారు. ఇలా చేయకపోతే ఓట్లు తీసేస్తున్నారు. బీజేపీ ఇలా గారడీల ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతోంది.

ఒకప్పుడు ప్రజల డిమాండ్‌ మేరకు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఆలోచన చేసి నాటి విశాలాంధ్రకు మద్దతు తెలిపాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రజల కోరిక మేరకు సీపీఐ తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చింది. ఇక్కడి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఐ వారి సమస్యలు, ఆలోచనలు, నిర్ణయాలను ప్రాతిపదికగా తీసుకుంటూ ముందుకెళ్తుంది. వందేళ్ల అనుభవం పార్టీ సొంతం కావడంతో.. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో లెఫ్ట్‌ పార్టీలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమిటన్నది ఈ సభల్లో చర్చిస్తాం. వీటిని ఎలా అధిగమించాలి, పోరాటాలతో ఎలా ముందుకెళ్లాలని కార్యాచరణ రూపొందించుకుంటాం.

కమ్యూనిస్టులంటే దేశ భక్తులు1
1/1

కమ్యూనిస్టులంటే దేశ భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement