రేసులో ఎవరెవరు?!
● ఐదు మున్సిపాలిటీల్లో నాలుగు చోట్ల మహిళలకే పీఠం ● మున్సిపాలిటీల్లో చైర్మన్లతో పాటు వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు ● దీటైన అభ్యర్థుల కోసం పార్టీల ఆరా
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పార్టీల వారీగా ఎవరు బరిలో ఉండనున్నారో తేలనుంది. అయితే గెలుపు గుర్రాల కోసం రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీలో చైర్మన్ గిరీ లక్ష్యంగా అనుకూలమైన స్థానాలపై పలువురు కన్నేయడంతో పోటీ నెలకొంది.
ఐదు మున్సిపాలిటీలు..
జిల్లాలోని పాత మున్సిపాలిటీలు సత్తుపల్లి, మధిర, వైరాకు తోడు కొత్తగా ఏర్పడిన ఏదులాపురంలో చైర్మన్ పదవులు ఏ కేటగిరీకి రిజర్వ్ అయ్యాయో శనివారం తేలింది. సత్తుపల్లి, మధిర, వైరా చైర్మన్ పదవి జనరల్ మహిళకు, ఏదులాపురం ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా, కల్లూరు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. అలాగే వార్డుల వారీ రిజర్వేషన్లు ప్రకటించారు. వార్డుల్లో మహిళల రిజర్వేషన్‌ను కలెక్టరేట్‌లో పార్టీల ప్రతినిధుల సమక్షాన లాటరీ ద్వారా ఖరారు చేశారు. రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో పలువురు పోటీకి సై అంటుండగా.. మరికొందరు ఆశలు తలకిందులయ్యాయని నిర్వేదంలో మునిగిపోయారు. రిజర్వేషన్లు తేలడంతో ఎక్కడ ఎవరిని బరిలోకి దించాలి.. చైర్మన్ పీఠాన్ని ఎలా దక్కించుకోవాలి.. అందుకు సమర్థులెవరు అన్న కోణంలో ఆరా తీయడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నేతలు నిమగ్నయ్యారు. సీపీఎం, సీపీఐ, బీజేపీ, న్యూడెమోక్రసీ కూడా బలమున్నచోట పోటీకి సన్నద్ధమవుతున్నాయి. పొత్తులపై స్పష్టత లేకపోవడంతో ఎవరికి వారు గతంలో ఎక్కడ పోటీ చేశాం.. ఇప్పుడు పోటీ చేస్తే బలాబలాలు ఎలా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేకున్నా ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వేషన్ కూడా ఖరారు చేశారు.


