ఉత్సవ సంబురం
ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాట్లు అరుణమయమైన ఖమ్మం నగరం హాజరుకానున్న సీపీఐ జాతీయ నేతలు, సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరం ఎరుపురంగు పులుముకుంది. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఆదివారం సాయంత్రం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరగనుంది. ఈనేపథ్యాన ఎర్ర జెండాల రెపరెపలు, తోరణాలు, ఫ్లెక్సీలతో నగరం అరుణవర్ణం పులుముకుంది. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రతినిధుల రాక మొదలైంది.
విప్లవ గుమ్మం
విప్లవోద్యమాలకు ఖమ్మం నగరం సాక్ష్యంగా నిలిచింది. దేశ స్వాతంత్య్రానికి ముందు ఆ తర్వాత ఎన్నో ఘటనలకు వేదికై ంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం దాకా ఇక్కడి కమ్యూనిస్టులు కీలకంగా నిలిచారు. తీవ్ర నిర్బంధాలు ఎదురైనా తెలంగాణ సాయుధ పోరాట సమయాన గ్రామగ్రామాన ఎర్ర జెండా రెపరెపలాడింది. ఎందరో యోధులు సాయుధ పోరాటంలో పాల్గొనగా.. కొందరు జిల్లా నేతలు ప్రాణాలు అర్పించారు. అలాగే, 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎర్ర జెండా నీడన పోరాటాలు చేశారు. జిల్లాకు గోదావరి జలాల తరలింపు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం కోసం సీపీఐ పోరాటాలు నిర్వహించింది.
ఎటు చూసినా అరుణ తోరణాలు
ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరిగే శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు ఆహ్వాన సంఘం తరఫున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 60 అడుగుల డిజిటల్ వేదిక సిద్ధం చేసి 40 వేల మందికి సరిపడా కుర్చీలు వేశారు. అంతేకాక కళాకారుల ప్రదర్శనలకు మరో వేదిక ఏర్పాటుచేశారు. ఇక నగరమంతటా ఎర్ర తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆహ్వాన సంఘం కార్యదర్శి బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, ఆహ్వాన సంఘ బాధ్యులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ప్రదర్శనలతో ప్రారంభమై..
సీపీఐ శతాబ్ది సభ సందర్భంగా ఖమ్మంలో మూడు వైపుల నుంచి ప్రదర్శనలు రానున్నాయి. బాగం హేమంతరావు నేతృత్వాన పెవిలియన్ మైదానం వద్ద నుంచి, డి.రాజా, కూనంనేని సాంబశివరావు, ఎస్‌కే.సాబీర్ పాషా, జమ్ముల జితేందర్‌రెడ్డి నేతృత్వాన శ్రీశ్రీ విగ్రహం వద్ద నుంచి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, మహ్మద్ మౌలానా, దండి సురేష్ నేతృత్వంలో మూడో ప్రదర్శన ఖమ్మం నయాబజార్ కళాశాల నుంచి మొదలవుతుంది. ఈ ప్రదర్శనల్లో కార్యకర్తల కవాతుతో పాటు బంజారా, కోయ నృత్యాలు, వృత్తి సంఘాల ప్రదర్శనలు ఉంటాయి.
సభకు అతిరథ మహారథులు
ఖమ్మంలో సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. అలాగే, కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు వేదికను పంచుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రదర్శనలు ప్రారంభమై మూడు గంటలకు మైదానానికి చేరతాయి. సీపీఐ జాతీయ నాయకులు అమర్ జిత్ కౌర్, బీకే.టాంగో, రామకృష్ణ పాండా, అనిరాజా, గిరిశర్మ, కె.ప్రకాష్‌బాబు, సందేష్ కుమార్, సంజయ్‌కుమార్, పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ హాజరుకానున్నారు. కాగా, సభ ఏర్పాట్లను శనివారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, నాయకులు హేమంతరావు తదితరులు పరిశీలించారు.
నేడు సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ


