సర్పంచ్, ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్
నేలకొండపల్లి: గ్రామపంచాయతీ నిధులు డ్రా చేసేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అన్నిరకాల నిధులకు ఇద్దరు సంతకాలు చేసిన చెక్కులనే ఆమోదించాలని డీటీఓ, అన్ని సబ్ ట్రెజరీలతో పాటు బ్యాంక్ మేనేజర్లకు సూచనలు అందాయి. ఈమేరకు జిల్లాలోని 571 గ్రామపంచాయతీల సర్పంచ్, ఉపసర్పంచ్‌లు తమ సంతకాలు ఇచ్చేందుకు మండల పరిషత్ కార్యాలయాలకు వచ్చారు. ఈ ప్రక్రియ అమల్లోకి వస్తే నూతన పాలకవర్గాల నేతృత్వాన అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల మంజూరు మొదలుకానుంది. కాగా, పంచాయతీ ఖాతాలు, రికార్డులన్నీ కార్యదర్శుల కస్టడీలోనే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
జమలాపురంలో
అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి వేలాదిగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం పల్లకీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఈఓ జగన్మోహన్‌రావు, ఆలయ ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, అర్చకులు పాల్గొన్నారు.
23 నుంచి పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు
రేపు వంద పడకల ఆస్పత్రి ప్రారంభం
మధిర: మధిరలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని ఈనెల 19వ తేదీన సోమవారం ప్రారంభించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. ఈనేపథ్యాన సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం నుంచి ఫర్నిచర్, వైద్య పరికరాలు, మందులను శనివారం నుంచి నూతన భవనంలోకి తరలిస్తున్నారు. ఆస్పత్రి ప్రారంభం కాగానే ఆ భవనం నుంచే వైద్యసేవలు అందుతాయి.


