పాలేరు సిగలో అభివృద్ధి మాల..
నూతన మార్కెట్
● మంత్రి పొంగులేటి చొరవతో వేగంగా పనులు ● రూ.19.90 కోట్లతో మార్కెట్, రూ.25 కోట్లతో నర్సింగ్ కాలేజీ సిద్ధం ● జేఎన్‌టీయూ భవనం, లింక్ కెనాల్, ఆస్పత్రికి నేడు సీఎం శంకుస్థాపన
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో రూ.వందల కోట్ల నిధులు మంజూరవుతుండగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధి జరుగుతోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం పాలేరు నియోజకవర్గంలో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించడమే కాక ఇంకొన్ని పనులను శంకుస్థాపన చేయనున్నారు.
అందుబాటులోకి నర్సింగ్ కాలేజీ
ఏదులాపురం మున్సిపల్ పరిధి మద్దులపల్లిలో రూ.25 కోట్లతో నర్సింగ్ కళాశాల భవనం నిర్మాణం పూర్తయింది. ఐదెకరాల్లో ఈ భవనం నిర్మించారు. విద్యార్థుల సౌకర్యం కోసం ఒకే ప్రాంగణంలో మూడు అంతస్తులతో కాలేజీ బ్లాక్, నాలుగు ఫ్లోర్లతో హాస్టల్ బ్లాక్ నిర్మించారు.
జలసవ్వడి
ఏటా మున్నేరు నది నుంచి సుమారు 50–60 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూ రు వద్ద ఉన్న చెక్‌డ్యామ్ నుంచి గ్రావిటీ ద్వారా పాలేరు లింక్ కెనాల్‌కు తరలించేందుకు నిర్ణయించారు. ఇలా 4,500 క్యూసెక్కుల నీటి తర లింపునకు 9.6కి.మీ. కెనాల్ నిర్మాణానికి రూ.162.54 కోట్లు కేటాయించారు. ఈ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. మున్నేటి నీరు వస్తే సాగర్ ఆయకట్టు పరిధి పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న భూములు, ఎగువ భాగాన 40వేల ఎకరాల ఎన్నెస్పీ ఆయకట్టులో సాగు సాఫీగా జరుగుతుందని, పాలేరు రిజర్వాయ ర్ ద్వారా రెండు మెగావాట్ల జల విద్యుదుత్పత్తికి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. కెనాల్ నిర్మాణంతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాల స్థిరీకరణ జరగనుంది.
100 పడకల ఆస్పత్రి
పాలేరు నియోజకవర్గంలో పీహెచ్‌సీలు ఉన్నా వంద పడకల ఆస్పత్రి లేకపోవడంతో నాలుగు మండలాలకు మధ్యలో ఆస్పత్రి నిర్మించనున్నారు. కూసుమంచి మండలం గట్టుసింగారంలో నిర్మాణానికి రూ.45.50 కోట్లు కేటాయించారు.
అధునాతనంగా జేఎన్‌టీయూ కళాశాల
పాలేరు నియోజకవర్గ పరిధిలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రస్తుతం వైటీసీ భవనంలో కొనసాగుతోంది. ఈనేపథ్యాన మద్దులపల్లిలో 30 ఎకరాలు సేకరించి సొంత భవన నిర్మాణాలకు రూ.108.64 కోట్లు కేటాయించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాలను విడదీసి 2018లో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుచేశారు. ఈమేరకు 23.28 ఎకరాల్లో రూ.19.90 కోట్ల నిధులతో మూడు కవర్ షెడ్లు, డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్స్, వేబ్రిడ్జితో పాటు కార్యాలయ భవనం నిర్మించారు. ఇక్కడ సీసీఐ, సివిల్ సప్లయీస్ ద్వారా పంట ఉత్పత్తులను సేకరించనున్నారు. పాలేరు నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా తాము పండించిన ఉత్పత్తులను విక్రయించడానికి ఈ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది.
పాలేరు సిగలో అభివృద్ధి మాల..


