చైర్మన్ రిజర్వేషన్
లెక్కల్లో ఆశావహులు
రిజర్వేషన్ అనుకూలిస్తే బరిలో నిలిచేందుకు సై
మార్గదర్శకాలు, నిబంధనలపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం
నేడో, రేపో చైర్మన్, వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకటన
ఎవరికో !
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు మాత్రం మిగిలింది. ఇది కూడా ముగిస్తే బరిలో నిలిచేందుకు రాజకీయ పార్టీల్లోని ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పురపాలక శాఖ రాష్ట్రస్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేయడమే కాక మున్సిపాలిటీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల కేటాయింపుపై మార్గదర్శకాలు, నిబంధనలను విడుదల చేసింది. వీటి ఆధారంగా వార్డు, చైర్మన్ స్థానం ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది. వార్డు రిజర్వేషన్లను స్థానికంగా, చైర్మన్ రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ప్రకటించనున్న నేపథ్యాన ఆశావహులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లు కూడా ఖరారైతే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కనుంది.
రిజర్వేషన్లపై కసరత్తు
జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల పరిధిలో చైర్మన్ స్థానం, వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుందో స్పష్టత వచ్చింది. ఆపై ఏ వార్డు ఏ కేటగిరీకి అనేది తేల్చాల్సి ఉంది. ఈమేరకు నిబంధనలను అనుసరించి ఏ వార్డు, ఏ చైర్మన్ స్థానం ఏ కేటగిరీకి కేటాయించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం స్థానిక జనాభాను ప్రాతిపదికగా తీసుకునేలా చర్యలు చేపట్టారు.
50 శాతం మించకుండా..
రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఉండేలా అధికారులు ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏ కేటగిరీలో జనాభా ఎంత, ఆ నిష్పత్తి ప్రకారం ఎన్ని స్థానాలు కేటాయించాలనే అంశాలను శాసీ్త్రయంగా లెక్కిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా ప్రతీ విభాగంలోనూ కచ్చితంగా 50 శాతం సీట్లు మహిళలకు చెందుతాయి. రాష్ట్రస్థాయిలో చేసిన రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని స్థానికంగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కలెక్టర్ ఆమోదంతో నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నిష్పత్తి లేకున్నా ఒక్క సీటైనా..
ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే గణాంకాలను రిజర్వేషన్ల కేటాయింపునకు ప్రాతిపదికగా తీసుకుంటోంది. మొదట ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, అనంతరం బీసీలకు వార్డుల రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయిస్తారు. అయితే, ఎక్కడైనా జనాభా తక్కువగా ఉండి ఒక్క సీటు కూడా రాకపోయినా కనీసం ఒక్క వార్డునైనా ఈ వర్గాలకు కేటాయించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఆపై బీసీ రిజర్వేషన్లను డెడికేషన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా నిర్ణయిస్తారు.
ఓవైపు రిజర్వేషన్ల కేటాయింపుపై కసరత్తు జరుగుతుండగా.. మరోవైపు ఆశావహులు లెక్కల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రస్థాయిలో ప్రకటించిన రిజర్వేషన్లను అనుసరించి తమ మున్సిపాలిటీ, వార్డు ఏ కేటగిరీకి రిజర్వ్ అవుతుందనే అంచనాలపై అనుచరులతో చర్చిస్తున్నారు. రిజర్వేషన్ తమకు అనుకూలంగా ఉంటుందా, లేదా అనే ఆలోచనలతో సతమతమవుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో అత్యధిక శాతం మంది చైర్మన్ గిరీపైనే కన్నేయడం.. కాంగ్రెస్ పార్టీలో వీరి సంఖ్య మరింతగా ఎక్కువగా ఉండడంతో చర్చలన్నీ ఈ పీఠంపైనే జరుగుతున్నాయి. రిజర్వేషన్ల అంశం తేలితే తమ నేతలను కలిసి టికెట్లు దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఒకవేళ తమకు కలిసి రాకపోతే ఏం చేయాలనే అంశంపైనా సమాలోచనలు చేస్తున్నారు. చైర్మన్‌తోపాటు వార్డులు కూడా ఏ కేటగిరీకి రిజర్వ్ అవుతాయనే అంశంపై ముందస్తుగానే అంచనా వేసే పనిలో ఉన్నారు.
మున్సిపాలిటీల్లో ఆశావహుల ఆసక్తి


