ఏదులాపురం అభివృద్ధి నా బాధ్యత
● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● పలు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దేలా అభివృద్ధి చేయడం తన బాధ్యత అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 50కి పైగా వెంచర్లు ఉన్నందున రోడ్లు, డ్రెయినేజీలు, రక్షిత తాగునీటి పథకాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై దృష్టి సారిస్తానని వెల్లడించారు. సత్యనారాయణపురంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఏదులాపురం అభివృద్ధి కోసం ఉద్యోగులు ఏకమై సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. అయితే, చెప్పినవన్నీ చిన్న సమస్యలే అయినందున పరిష్కరించడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీల్లో అభివృఽధ్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే రూ.15.77కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినందున మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈకార్యక్రమాల్లో మద్దులపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ బైరు హరినాధ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీఓ నర్సింహారావు, ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.విజయ్, ఎర్రమళ్ల శ్రీనివాస్‌తో పాటు శంకర్, పెరుమాళ్లపల్లి శ్రీనివాస్, బండి జగదీష్, తోట చినవెంకటరెడ్డి, దండ్యాల వెంకటేశ్వర్లు, బానోత్ భాస్కర్, చెన్నబోయిన వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఏదులాపురం మున్సిపల్ పరిధిలో పర్యటించనున్న నేపథ్యాన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, సీపీ సునీల్‌దత్‌తో కలిసి పరిశీలించారు. మద్దులపల్లి మార్కెట్ సమీపాన సభాస్థలి, నర్సింగ్ కళాశాల వద్ద వాహనాల పార్సింగ్ ప్రాంతాన్ని పరిశీలించి సూచనలు చేశారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ పైలాన్ శనివారం వరకు సిద్ధమవుతుందని, హెలీప్యాడ్ వద్ద వీవీఐపీలు, మంత్రుల, సీఎం కాన్వాయ్ వాహనాలు మాత్రమే అనుమతించి.. మిగిలిన ప్రజాప్రతినిధుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


