కల నెరవేరేనా?
ఉమ్మడి జిల్లాలో డిమాండ్ ఉన్న కొత్త మండలాలు
జిల్లాల పునర్విభజన సమయాన కొన్ని మండలాల ఏర్పాటు
అప్పటి నుంచే ఇంకొన్ని చోట్ల నుంచి డిమాండ్లు
ఇటీవల తెరపైకి జిల్లాల పునర్విభజన, మండలాల అంశం
కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వ సన్నాహాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలతోపాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరికొన్ని మండలాల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినా ఆమోదానికి నోచుకోలేదు. అలాగే, ప్రజల నుంచి కూడా మండలాల ఏర్పాటుకు డిమాండ్లు వచ్చాయి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆ అంశం మరుగున పడింది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై ప్రకటన చేయడంతో కొత్త మండలాల కోసం ఎదురుచూస్తున్న ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
కొన్ని అటు... ఇంకొన్ని ఇటు
జిల్లాల పునర్విభజన సమయాన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త మండలాలు ఏర్పడ్డాయి. 2016లో ఖమ్మం జిల్లా విడిపోయి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలుగా రూపాంతరం చెందాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మండలాలు ఉండగా, కొన్ని మండలాలు ఇతర జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొన్ని కలవడంతో 21 మండలాలతో ఖమ్మం, 23 మండలాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి, ఆళ్లపల్లి, కరకగూడెం మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. అలాగే, వైరా డివిజన్ స్థానంలో కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. అదే సమయాన మరికొన్ని మండలాలకు అధికారులు కసరత్తు చేసినా కార్యరూపం దాల్చలేదు.
ఏర్పాటు చేయాల్సిందే....
ప్రజల నుంచి కొన్ని.. పాలనా సౌలభ్యం కోసం అధికారుల తరఫున మరికొన్ని మండలాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. కానీజిల్లాల పునర్విభజన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ డిమాండ్లపై దృష్టి సారించకపోవడంతో నిలిచిపోయాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు, సుబ్లేడు గ్రామాలకు సంబంధించిన నివేదిక తయారు చేయాలని సూచించడంతో పాటు ఏది మండల కేంద్రంగా చేస్తే బాగుంటుందో నిర్ణయిస్తామని తెలిపారు.
మరోసారి ఆశలు
చాన్నాళ్లుగా కొత్త మండలాల అంశం మరుగున పడింది. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటనతో చర్చ మొదలైదిం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మండలాల ఏర్పాటుకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. వీటిలో కొన్ని మండలాలు తప్పక ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మండల కేంద్రానికి వెళ్లేందుకు దూరాభారం అవుతున్నందున మండలం ఏర్పాటుతో సౌలభ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
శాసీ్త్రయంగా..
మండలాల ఏర్పాటుకు శాసీ్త్రయత ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. డిమాండ్ ఉన్నచోటల్లా ఏర్పాటుచేయకుండా.. అక్కడ మండల ఆవశ్యత, ఉపయోగాలు, ప్రజల సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలనే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాక అసెంబ్లీలో చర్చించి అందరి సలహాలతో మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఇందుకోసం హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిషన్ ఆరునెలల పాటు పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాక నిర్ణయం వెలువడనుంది.
మండలం కొత్త మండలం
ఖమ్మంరూరల్ ఎం.వెంకటాయపాలెం
తిరుమలాయపాలెం బచ్చోడు / సుబ్లేడు
సత్తుపల్లి గంగారం
వేంసూరు అడసర్లపాడు
పెనుబల్లి లంకపల్లి
కల్లూరు చెన్నూరు
తల్లాడ అన్నారుగూడెం
అశ్వాపురం మొండికుంట
ఇల్లెందు కొమరారం / రొంపేడు
టేకులపల్లి బోడు
అశ్వారావుపేట వినాయకపురం


