లక్ష్యానికి దూరమే..
వివరాలిలా
● ముగింపు దశకు చేరిన ధాన్యం కొనుగోళ్లు ● జిల్లాలో 4లక్షల మె.టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ● ఇప్పటివరకు 2,51,472.840 మె.టన్నులే కొనుగోలు
ఖమ్మం సహకారనగర్: ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేసిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేస్తుండగా ప్రక్రియ ముగింపు దశకు చేరింది. జిల్లాలో 331 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. కొన్నాళ్లుగా పలు కేంద్రాలకు ధాన్యం నిలిచిపోవడంతో 250 కేంద్రాలను మూసివేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 21మండలాల పరిధిలో 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ 43,176మంది రైతుల నుంచి 2,51,472.840మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేయగలిగారు.
ప్రణాళికాయుతంగా...
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను అధికార యంత్రాంగం ప్రణాళికాయుతంగా చేపట్టింది. గతంలో మాదిరిగా కాకుండా కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించటంతో పాటు రైతులకు ఇబ్బంది రాకుండా చూశారు. వర్షం వస్తుందనుకున్న సమయంలో జాగ్రత్తలపై సూచనలు చేయడమే కాక అవసరమైనన్ని గన్నీసంచులు, టార్ఫాలిన్లు సమకూర్చారు. అయితే, 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంలో 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా రైతులు తీసుకురాలేదు. ఇప్పటికే కొనుగోళ్లు చివరి దశకు చేరినందున లక్ష్యం చేరడం కష్టమేనని తెలుస్తోంది. ప్రభుత్వం సన్నధ్యానానికి మద్దతు ధరతో పాటు బోనస్ ప్రకటించినా కల్లాలోనే వ్యాపారులు అదే స్థాయిలో నగదు చెల్లించడంతో రైతులు అటే మొగ్గు చూపినట్లు తెలిసింది. రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండే బాధ తప్పుతుందనే భావనతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించడంతోనే ప్రభుత్వ కేంద్రాలకు అనుకున్న లక్ష్యం మేర ధాన్యం రాలేదని తెలుస్తోంది.
అయిపోయినట్టే..
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వారం, పది రోజులో ముగిసే అవకాశం ఉంది. మొత్తం 331 కేంద్రాలను గాను 250కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. మిగతా కేంద్రాలకు కూడా రైతులు రాకపోగా, గతంలో కొనుగోలు చేసిన ధాన్యమే నిల్వ ఉంది. ఈ ధాన్యాన్ని కూడా మిల్లులకు తరలించాక ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించనున్నారు.
కొనుగోలు కేంద్రాలు 331
సేకరించిన ధాన్యం 2,51,472.840 మె. టన్నులు
ధాన్యం అమ్మిన రైతులు 43,176మంది
ధాన్యం విలువ రూ.600,76,86,148
ఇప్పటివరకు చెల్లింపులు రూ.530,37,33,249


