ముంపు నుంచి శాశ్వత విముక్తి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర: వైరా నది వరద ముంపు నుంచి మధిరకు శాశ్వతంగా విముక్తి కల్పించేలా రిటైనింగ్ వాల్ నిర్మించనున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈమేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించారు. అంతేకాక క్షేత్రస్థాయిలో మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద పరిశీలించిన డిప్యూటీ సీఎం.. వర్షాకాలంలో వచ్చే వరద ఆధారంగా రిటైనింగ్ వాల్ ఎత్తు ఎంత ఉండాలనే అంశంపై చర్చించారు. అలాగే వైరా నదిపై మధిర నుంచి మడుపల్లి వరకు బ్రిడ్జి నిర్మాణ అవకాశాలపై ఆరా తీశారు. రిటైనింగ్ వాల్, బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి సర్వే నిర్వహించి నివేదిక రూపొందించాలని తెలిపారు. రిటైనింగ్ వాల్, బ్రిడ్జి నిర్మాణానికి ఎంత భూమి సేకరించాల్సి వస్తుందో నివేదికలో పొందుపర్చాలని చెప్పారు. మధిర మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా చేపడుతున్న పనులు వేగంగా జరిగేలా యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు, మధిర అభివృద్ధి అడ్వైజరీ కమిటీ సభ్యులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, మిరియాల రమణగుప్తా, రంగా శ్రీనివాసరావు, బెజవాడ రవిబాబు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే, క్యాంపు కార్యాలయంలో మధిరకు చెందిన వ్యాపారులతో డిప్యూటీ సీఎం భేటీ అయి సమస్యలపై ఆరా తీశారు. పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.
50మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జ్
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో మెరుగైన పాలన అందించేలా కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. అనంతరం మధిర మున్సిపాలిటీ పరిధిలో 50 మంది ఓటర్లకు గాను ఒక ఇన్‌చార్జ్‌ను నియమించగా వారితో ఆలయ సమీపాన సమావేశమై పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు రమణగుప్తా తదితరులు పాల్గొన్నారు.


