కోసల రామా.. కౌసల్యా తనయా..
భద్రాద్రి రామయ్యకు ఘనంగా
విశ్వరూప సేవ
భద్రాచలం: భద్రగిరిలో మాత్రమే ప్రత్యేకమైన విశ్వరూప సేవ భక్తులను అలరించింది. మహాదర్బార్ సేవలో ఆశీనులైన అర్చనామూర్తులు, సర్వదేవతల నడుమ కొలువుదీరిన సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను భక్తజనం దర్శించుకున్నారు. ధూప, దీప నైవేద్యాలు, చుట్టూ 108 మంది అర్చనామూర్తుల నడుమ జగాలను ఏలే జగదభి రాముడికి జరిగిన ‘మహా దర్బార్’ ఆధ్యాత్మికతను చాటింది. గరుత్మంతుడి వాహనంపై రాజాధిరాజుగా భద్రాచల రామయ్య దర్శనంతో భద్రగిరి పులకించింది.
భద్రాచలంలోనే ప్రత్యేకం..
ముక్కోటి ఉత్సవాలు ముగిశాక భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మాత్రమే బహుళ ద్వాదశి రోజున ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. సంవత్సర కాల పూజల్లో దొర్లే దోషాల నుంచి ప్రాయశ్చిత్తం కోసం శ్రీ సీతారామలక్ష్మణ స్వామి, ఆలయం ప్రాంగణంలోని ఉపాలయాల్లో ఉండే అర్చనా మూర్తులను ఒకే చోటకు చేర్చి ఏకకాలంలో సేవలను నిర్వహించడం ఈ విశ్వరూప సేవ విశిష్టత. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను గర్భగుడి నుంచి మంగళవాయిద్యాల నడుమ బేడా మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చి దీపారాధన, మహాప్రభుతోత్సవం జరిపారు. పూజల అనంతరం స్వామికి ప్రత్యేక కదంబ ప్రసాదం నివేదించారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సర్వ బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కాగా, విశ్వరూప సేవను పురస్కరించుకుని బేడా మండపాన్ని విద్యుత్ దీపాలు, షామియానాలతో అలంకరించారు. స్థానాచార్యులు రామచంద్ర.. రఘువీర.. రామచంద్ర.. రణధీర తదితర కీర్తనలను ఆలపిస్తుండగా, భక్తులు శ్రీరామయనమః అంటూ శ్రుతి కలిపారు. ఈఓ కొల్లు దామోదర్‌రావు దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు, ఈఈ రవీందర్, ఏఈవోలు శ్రవణ్‌కుమార్, భవాని రామకృష్ణ, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.


