రెక్కలు విప్పిన పందెం కోళ్లు
తెలంగాణ – ఏపీ సరిహద్దుల్లో
జోరుగా పందేలు
జిల్లా నుంచి భారీగా వెళ్లిన జనం
జేబులు ఖాళీ చేసుకున్న పలువురు
సత్తుపల్లి: భోగి, సంక్రాంతి, కనుమ పండుగ మూడు రోజులు పందెంరాయుళ్ల హడావుడి అంతాఇంతా కాదు. క్షణాల్లో రూ.లక్షలు రావటం.. మరుక్షణంలో సర్వం కోల్పోయిన వారు బాధతో తిరుగుముఖం పట్టారు. వ్యవసాయ సీజన్ కావడంతో అందరి వద్ద చేతిలో డబ్బు ఉండడంతో తెలంగాణ – ఏపీ సరిహద్దుల్లో జరిగిన పందెం బరులకు పరుగులు తీశారు. ఏపీలోని మంత్రుల స్థాయి నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల సహకారం పందేల నిర్వాహకులకు ఉండడంతో పండుగ మూడు రోజులు ఆటంకం లేకుండా బిర్రులు కళకళలాడాయి.
వీఐపీల తాకిడి
సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్రాకు సరిహద్దున ఉండడంతో బిర్రుల వద్ద సత్తుపల్లితో పాటు జిల్లా వాసుల సందడి కనిపించింది. ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో పందాలను తిలకించేందుకు జిల్లా వాసులు క్యూ కట్టారు. టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నూజివీడు సమీపంలోని మీర్జాపురం బిర్రు వద్ద కనిపించారు.
నలువైపులా భారీ స్క్రీన్లు
మీర్జాపురం, విస్సన్నపేట మండలం తాతకుంట్ల, దెందులూరులో స్టేడియంలను తలపించేలా బిర్రులు ఏర్పాటుచేయడమే కాక నలువైపులా పందెంరాయుళ్లకు కనిపించేలా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక చింతలపూడి నియోజకవర్గంలోని సీతానగరం, రాఘవపురం, శివాపురం, చింతంపల్లి, తిరువూరు నియోజకవర్గంలోని కాకర్ల, పుట్రేల, చాట్రాయి, నర్సింహారావుపాలెంల్లోనూ పందేలు చూసేందుకు, కాసేందుకు తెలంగాణ వాసులు వెళ్లారు.
రూ.లక్షలు దాటి రూ.కోట్లలో
దింపుడు పందెం, ఎత్తుడు పందెం, ఐదెచ్చు.. ఆరేచ్చు.. పందెం ఓకేనా.. అంటూ బిర్రుల్లో కేకలతో హోరెత్తించారు. మీర్జాపురంలో తొలిరోజు ఆరు పందేలు రూ.25లక్షలు వేయడంతో దీనిని తిలకించేందుకు పలువురు ఆసక్తి కనబర్చారు. గతంతో పోలిస్తే ప్రవేశాన్ని కట్టుదిట్టం చేయడంతో పాస్‌లు లేనివారు ఇబ్బంది పడ్డారు. అయినా రూ.కోట్లల్లో నగదు చేతులు మారింది. సంప్రదాయ కోడి పందేల మాటున రూ.కోట్లల్లో పేకాట జూదం సైతం నడిచింది. లోనా.. బైటా పేకాటతో క్షణాల్లో రూ.లక్షలు చేతులు మారాయి. బిర్రుల్లో కోడి పందెం తర్వాత స్థానంలో మూడురోజులు రాత్రీపగలు తేడా లేకుండా జూదం నడిచింది. జూదరులకు నిర్వాహకులే భోజనాలు, మద్యం సరఫరా చేయడం గమనార్హం. అంతేకాక కోడి పందేల శిబిరాల వద్ద గుండు పట్టాలు, పులి,మేకా జూదం, నెంబర్లు ఆట విచ్చలవిడిగా నిర్వహించారు. చూడటానికి చిన్నజూదంలా కన్పించినా ఇక్కడ కూడా రూ.లక్షల్లో చేతులు మారడంతో పలువురు సర్వం కోల్పోయారు.
రెక్కలు విప్పిన పందెం కోళ్లు
రెక్కలు విప్పిన పందెం కోళ్లు


