ప్రారంభానికి ముందే ప్రమాదాలు
వైరా/తల్లాడ: ఖమ్మం – దేవరపల్లి మార్గంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డు హైవే ప్రారంభానికి ముందే ప్రమాదాలు మొదలయ్యాయి. సంక్రాంతి రద్దీ నేపథ్యాన హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు హైవేను ఎంచుకుంటున్నారు. అయితే, ఇంకా ప్రారంభించపోవడంతో ప్రమాద హెచ్చరికలు, సిబ్బంది పర్యవేక్షణ లేకపోగా, పొగ మంచుతో శుక్రవారం ఉదయం రెండు ప్రమాదాలు జరిగాయి.
ఎదురెదురుగా కార్లు ఢీ
వైరా వైపు నుంచి కారులో తిరువూరు వెళ్తున్న బి.రమేష్.. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవా కారును ఎదురుగా ఢీకొట్టాడు. ఘటనలో ఇన్నోవాలో ఉన్న శ్రీనివాస్‌తో పాటు రమేష్‌కు సైతం తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో ఖమ్మం తరలించారు. పొగమంచు తీవ్రతతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు. ఇక తల్లాడ– కల్లూరు సమీపాన కేశ్వాపురం వద్ద మొక్కలకు నీళ్లు పట్టేందుకు వచ్చిన ట్యాంకర్‌ను హైవేపై నిలిపారు. పొగ మంచుతో ఇది కనిపించక హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఆ వెనకాల వచ్చిన మరో కారు మొదటి కారును ఢీకొంది. దీంతో ముందు కారులో ఉన్న హైదరాబాద్‌కు ఒకే కుటుంబీకులు జె.శ్రీనివాసరావు, జె.జయలక్ష్మి, జె.ప్రణతికి తీవ్ర గాయాలు కాగా, వెనక కారులో నలుగురికి సైతం గాయాలయ్యాయి. తల్లాడ ఎస్‌ఐ ఎన్.వెంకటకృష్ణ చేరుకుని క్రేన్ సాయంతో కార్లను తొలగించి, క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై రెండు ఘటనల్లో
పలువురికి గాయాలు


