మూడు తరాల ఆత్మీయ సమ్మేళనం
వైరారూరల్: నలుగురు ఒక దగ్గర కూర్చుని మంచీచెడు మాట్లాడుకోవాలనుకున్నా ఉరుకుల పరుగుల యుగంలో సాధ్యపడడం లేదు. అలాంటిది ఒకరు, ఇద్దరు కాదు మూడు తరాల చెందిన 250 మంది ఒకచోటకు చేరడం విశేషం. వైరా మండలంలోని కేజీ సిరిపురానికి చెందిన ఐనాల గురువయ్య–కనకమ్మ కుటుంబీకులు సంక్రాంతి సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. ఈ సందర్భంగా తొలితరం వారు తమ జ్ఞాపకాలను నేటి తరానికి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని తిరువూరు, పీకే బంజర, అమ్మపాలెం, ఎల్లంపేట, మహబూబాబాద్, మరిపెడ, అబ్బాయిపాలెం, చిల్లంచర్ల తదితర ప్రాంతాల్లో స్థిరపడిన ఐనాల కుటుంబీకులు ఈ సమ్మేళనానికి పిల్లాపాపలతో హాజరుకావడమే కాక రోజంతా ఆటపాటలతో సందడి చేశారు.


