‘సీతారామ’తో సస్యశ్యామలం | - | Sakshi
Sakshi News home page

‘సీతారామ’తో సస్యశ్యామలం

Jan 14 2026 10:03 AM | Updated on Jan 14 2026 10:03 AM

‘సీతా

‘సీతారామ’తో సస్యశ్యామలం

● మంచుకొండ లిఫ్ట్‌తో రఘునాథపాలెంకు సాగు కళ ● ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల

● మంచుకొండ లిఫ్ట్‌తో రఘునాథపాలెంకు సాగు కళ ● ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల

సాక్షిప్రతినిధి, ఖమ్మం/ రఘునాథపాలెం: ‘సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తాం. ఎన్నెస్పీ ఆయకట్టుకు కూడా సీతారామ జలాలు వస్తాయి. మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుతం ఎన్నెస్పీ నీళ్లు వస్తున్నా.. త్వరలోనే రఘునాథపాలెం మండలానికి సీతారామ ప్రాజెక్టు జలాలు కూడా వస్తాయి’ అని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మండలంలోని వీ.వీ.పాలెం వద్ద సాగర్‌ ప్రధాన కాల్వపై రూ.66.33 కోట్ల వ్యయంతో నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం ప్రారంభించిన మంత్రి నీటి విడుదల అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రఘునాథపాలెం మండలానికి ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, మెడికల్‌ కాలేజీతో పాటు ప్రాధాన్యత కలిగిన స్వామి నారాయణ స్కూల్‌ వచ్చిందని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహకానికి ఈ మండలం ఎగువన ఉండడంతో సాగునీటి సౌకర్యం లేనందున ఎత్తిపోతల పథకం నిర్మించామని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో తన చేతుల మీదుగా 300 ఎత్తిపోతల పథకాలు ప్రారంభించినట్లు తెలిపారు. బుగ్గవాగు ద్వారా గ్రావిటీతో రఘునాథపాలెం మండలంలోని చెరువులకు కూడా నీళ్లు వచ్చేలా పనులు చేపడుతామని.. తద్వారా అటు కృష్ణా, ఇటు బుగ్గవాగు జలాలకు తోడు సీతారామ ప్రాజెక్టు నీరు కూడా వస్తే రఘునాథపాలెం మండలం సాగునీటి కళ సంతరించుకుంటుందని మంత్రి తెలిపారు. గత ఏడాది ఇదేనెల 13వ తేదీన శంకుస్థాపన చేసి మళ్లీ ఇదేరోజు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించిన మంత్రి... సాగుకు జలాలు వచ్చినందున రైతుల ఇళ్లల్లో సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

రాజకీయాన్ని యజ్ఞంలా చేశా..

తపస్సులా, యజ్ఞంలా రాజకీయాలు చేశానని మంత్రి తుమ్మల వెల్లడించారు. కులమతాలు, పార్టీలు చూడకుండా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని పేర్కొన్నారు. గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు, సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో జిల్లా ప్రగతిపథంలో కొనసాగుతోందని చెప్పారు. ఉమ్మడి జిల్లాను సాగులో నెంబర్‌వన్‌గా నిలపడమే తన ఆశయమన్నారు. ఆయిల్‌పామ్‌ సాగులో మూడేళ్లలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లను తుమ్మల సన్మానించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, సీపీ సునీల్‌దత్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, మేయర్‌ పునుకొల్లు నీరజ, జల వనరుల శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈఈలు అనన్య, ఝాన్సీ ఖమ్మం మార్కెట్‌, ఆత్మ కమిటీల చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ, దీపక్‌చౌదరి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు నాయకులు మానుకొండ రాధాకిషోర్‌, సాదు రమేష్‌రెడ్డి, తాతా రఘురాం, వాంకుడోత్‌ దీప్లానాయక్‌, తుపాకుల యలగొండ స్వామి పాల్గొన్నారు.

‘సీతారామ’తో సస్యశ్యామలం1
1/1

‘సీతారామ’తో సస్యశ్యామలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement