నానాటికీ పెరుగుతున్న నిర్బంధం
● చారిత్రక మలుపుగా నిలవనున్న ఖమ్మం సభ ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ఖమ్మంమయూరిసెంటర్: బీజేపీ పాలనలో నిర్బంధం పెరుగుతుండగా, బూటకపు ఎన్‌కౌంటర్లలో ఓ పక్క హతమారుస్తూనే ప్రశ్నించే వారిని అర్బన్ నక్సల్స్ పేరుతో నిర్బంధాలకు గురి చేస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూనంనేని మాట్లాడారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. కాగా, ఖమ్మంలో ఈనెల 18న జరిగే సీపీఐ శత వసంతాల సభ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలవడమేకాక ప్రజా ఉద్యమాలకు కీలక మలుపు కానుందని చెప్పారు. నేరాలు, దోపిడీ రూపు మారినా వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని కూనంనేని స్పష్టం చేశారు. దేశంలో కమ్యూనిస్టుల ఐక్యత పురోగమనానికి ఊతంగా నిలుస్తుందని తాము భావిస్తుండగా, ప్రజలు సైతం ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. ఈనెల 18న జరిగే సభలో సౌహార్థ సందేశాలు ఇచ్చేందుకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారని చెప్పారు. అలాగే, 20న ‘భారతదేశం – వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై జరిగే జాతీయ స్థాయి సెమినార్‌లో వామపక్షాల నేతలు డి.రాజా, ఎంఏ బేబీ, దీపాంకర్ భట్టాచార్య, మనోజ్ భట్టాచార్య, జి.దేవరాజన్ తదితరులు పాల్గొంటారని వివరించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ కౌన్సిల్ సమావేశాలు కూడా మూడు రోజులు ఖమ్మంలో జరగనున్నాయని కూనంనేని వెల్లడించారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.


