విద్యుత్ వినియోగదారులకు లేఖలు
● రాయితీల వివరాలతో డిప్యూటీ సీఎం పేరిట ముద్రణ ● లబ్ధిదారులకు అందిస్తున్న ఉద్యోగులు
రఘునాథపాలెం/ఖమ్మం వ్యవసాయం: విద్యుత్ రాయితీ పొందుతున్న లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పేరిట నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా, రాయితీపై విద్యుత్ అందించే గృహజ్యోతి, వ్యవసాయ వినియోగదారులకు డిస్కం సంస్థల ద్వారా ఈ లేఖల పంపిణీ మొదలైంది. వినియోగదారులతో ప్రత్యక్ష బందాలను బలోపేతం చేసుకోవడం కోసం ఈ వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెబుతున్నారు. వినియోగదారుల పేరు, సర్వీస్ నంబర్ పొందుపర్చిన లేఖలను వారి ఇళ్లకు వెళ్లి డిస్కం అధికారులు, ఉద్యోగులు అందజేస్తున్నారు. జిల్లాలో లేఖల పంపణీని ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి సోమవారం రఘునాథపాలెం మండలం వీవీ.పాలెంలో ప్రారంభించారు. జిల్లాలోని గృహజ్యోతి వినియోగదారులకు 2,46,855 సర్వీసుల ద్వారా రూ.200.53 కోట్ల సబ్సిడీ అందుతుండగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం ద్వారా 1,18,231 సర్వీసులకు రూ.619.55 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందని ఎస్‌ఈ తెలిపారు. వీవీ.పాలెంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ కాపా ఆదినారాయణ, గ్రామ కార్యదర్శి కృష్ణ, ఏఈ నాగేశ్వరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.
● విద్యుత్ వినియోగదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరుతో ముద్రించిన లేఖల పంపిణీ సోమవారం జిల్లాలో మొదలైంది. ఇందులో ఉచిత, సబ్సిడీ విద్యుత్ వివరాలతో పాటు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ లేఖలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డికి కూడా ఎస్‌ఈ శ్రీనివాసాచారి, అధికారులు అందించి సత్కరించారు.


