కాంగ్రెస్‌లో మహిళలకు పెద్దపీట
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం రూరల్/కొత్తగూడెంఅర్బన్/పాల్వంచరూరల్ : మహిళా సాధికరతే లక్ష్యంగా, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదేసమయాన కాంగ్రెస్ పార్టీలోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి సాయిప్రభాత్‌నగర్‌తో పాటు కొత్తగూడెం, పాల్వంచలో సోమవారం నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలను ఆయన ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, తన సతీమణి మాధురితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వాతావరణం ఉట్టిపడేలా మహిళలు అందమైన ముగ్గులు వేశారని అభినందించారు. అలాగే, భద్రాద్రి డీసీసీ అధ్యక్షురాలిగా తోట దేవీప్రసన్న ప్రమాణ స్వీకారంలో కూడా మంత్రి పాల్గొని మాట్లాడారు. దేవీప్రసన్న నియామకంతో తమ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు మంజూరు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


