ఎంవీఐ కార్యాలయాన్ని వైరాలోనే కొనసాగించాలి
వైరా: మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని బోనకల్‌కు తరలించాలనే ఆలోచన మానుకుని వైరాలోనే కొనసాగించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. వైరాలోని సీపీఎం కార్యాలయంలో చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, బీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణా ల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, టీడీపీ నాయకులు మోత్కూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు. వైరా, తల్లాడ, కొణిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, చింతకాని మండలాల వాహనదారులకు వైరా లోనే ఎంవీఐ కార్యాలయం ఉంటేనే సేవలు సులభమవుతాయని తెలిపారు. మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బోనకల్‌లో సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయించుకునే అవకాశమున్నందున వైరా కార్యాలయాన్ని తరలించొద్దని కోరారు. ఈ సమావేశంలో తాళ్లపల్లి కృష్ణ, బాణాల శ్రీనివాసరావు, షేక్ లాల్ మహ్మద్, శ్రీనివాసరావు, మనుబోలు వెంకటకృష్ణ, ఏదునూరి శ్రీను, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


