చికెన్ ధరలకు రెక్కలు
పెరిగిన ఖర్చులు
కేజీ ధర రూ.300కు పైగానే...
డిమాండ్‌కు తగిన ఉత్పత్తి
లేకపోవడంతో భారం
దాణా, పిల్ల ధర, నిర్వహణ
ఖర్చులు పెరగడం మరో కారణం
మటన్ తినలేం.. చికెన్ కొనలేం
ఉత్పత్తి లేకపోవడమే కారణం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో చికెన్ ధర పెరుగుతోంది. కొద్దినెలల క్రితం కిలో చికెన్(స్కిన్‌లెస్) ధర రూ.200 ఉండగా, నెల క్రితం రూ.220 నుంచి రూ.250 వరకు పలికింది. ఇక క్రిస్మస్ పండుగ నాటికి రూ.270, ఈనెల మొదట్లో రూ.280కి చేరగా ఇప్పుడు రూ.300, అంతకు మించి ధరతో విక్రయిస్తున్నారు. ఇక స్కిన్‌తో రూ.270, లైవ్ బర్డ్ ధర రూ.150 ఉంటోంది. సంక్రాంతి పండుగ నాటికి ధర పెరుగుతుందని, తెలంగాణ మహాజాతర మేడారం సమయానికి కొండెక్కే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఓ వైపు పండుగలు, మరో వైపు శుభకార్యాల సీజన్ కావడంతో చికెన్ వినియోగం పెరిగినా ఆ స్థాయిలో ఉత్పత్తి లేకపోవడం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.
రెండు నెలల క్రితం డిమాండ్ లేక..
చికెన్‌కు రెండు నెలల క్రితం డిమాండ్ లేకపోవడంతో పౌల్ట్రీ ఫారాల యజమానులకు నష్టం ఎదురైంది. దీంతో ఆ సమాయన ఉత్పత్తి తగ్గించగా ప్రస్తుతం డిమాండ్ తగినట్లు సరఫరా చేయలేకపోతున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం ఆర్డర్లు పెరిగినా ఆ స్థాయిలో ఉత్పత్తి లేక కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. ప్రస్తుతం పండుగలు, శుభకార్యాల కారణంగా చికెన్ వినియోగం పెరిగింది. ఇదే సమయాన పరిశ్రమల వద్ద లైవ్ బర్డ్ ధర పెరగడం చికెన్ ధరపై ప్రభావం చూపిస్తోంది. జిల్లాలో నిత్యం 80 – 90 టన్నుల వరకు చికెన్ వినియోగం జరుగుతున్నట్లు అంచనా. జిల్లా కేంద్రంలోనే 30 – 35 టన్నుల వినియోగం ఉంటుందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల్లో 60 లక్షలకు పైగా కోళ్లను పెంచేందకు అవకాశం ఉన్నా గత అనుభాలు, ఇతర కారణాలతో ప్రస్తుతం 30 – 35 లక్షలకు మించడం లేదు.
కోళ్ల ఉత్పత్తిలో ప్రధానమైన దాణా, పిల్లల ధరలు పెరగడం కూడా చికెన్ ధర పెరగడానికి కారణంగా చెబుతున్నారు. దాణాలో ప్రధానమైన మొక్కజొన్న వంటి పంటల ఉత్పత్తి తగ్గిపోవటంతో ధర పెరిగింది. ఇక హేచరీస్‌లో కోడి పిల్లకు రూ.25 నుంచి రూ.30 ఉన్న ధర ప్రస్తుతం రూ.40గా పైగా పలుకుతుంది. ఇవేకాక పౌల్ట్రీ ఫారాల నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి.
చికెన్ ధర బాగా పెరిగింది. కేజీ ధర రూ.300 ఉండడంతో ప్రతీ ఆదివారం కొనలేని పరిస్థితి ఉంది. మరోపక్క మటన్ ధర సామాన్యులకు అసలే అందుబాటులో లేదు. ఇప్పుడు చికెన్ ధర కూడా పెరగడంతో సామాన్యులపై భారం పడినట్టే.
– సోమారపు సుధీర్, ప్రకాష్‌నగర్, ఖమ్మం
రెండు నెలల క్రితం కోళ్ల ఉత్పత్తి పెరిగి చికెన్ ధరలు పడిపోయాయి. తక్కువ ధరలకు కోళ్లను విక్రయించాల్సి రావడంతో నష్టం కారణంగా ఉత్పత్తి తగ్గించారు. దీంతో ప్రస్తుత డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేక చికెన్ ధరపై ప్రభావం పడుతోంది.
– రావి బాబూరావు,
పౌల్ట్రీ ఫాం యజమాని, ఖమ్మం
చికెన్ ధరలకు రెక్కలు
చికెన్ ధరలకు రెక్కలు
చికెన్ ధరలకు రెక్కలు


