ఉద్యమాలను నడిపించేది కలాలే
కమ్యూనిస్టులు లేరనే వారికి
భయమెందుకు?
‘నూరేళ్ల అరుణ కేతనం’
ఆవిష్కరణ సభలో అశోక్‌తేజ
ఖమ్మంమయూరిసెంటర్: పీడన, నిర్బంధాల నుంచే ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయని.. ఆ ఉద్యమాలను నడిపించేది కవుల కలాలేనని ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ తెలిపారు. ప్రజలే ఇతివృత్తంగా నిర్బంధాలకు వ్యతిరేకంగా వచ్చేదే సరైన కవిత్వమని ఆయన పేర్కొన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం, సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన సోమవారం ఖమ్మంలోని డీపీఆర్‌సీ భవనంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తొలుత 60మంది కవుల రచనలతో రూపొందించిన ‘నూరేళ్ల అరుణ కేతనం’ కవితా సంకలనంతో పాటు అభ్యుదయ రచయితల సంఘం(అరసం) బాధ్యుడు కోంపెల్లి రామయ్య రచించిన ‘నా గమ నం’ కవితా సంపుటిని సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించాక మాట్లాడారు. వెలకట్టలేని త్యాగాలు చేసే కమ్యూనిస్టులు సమాజ మార్పును కోరుకుంటారని తెలిపారు. ‘దొంగ ఓట్లు.. దొంగనోట్లు ఇచ్చు రాజ్య ము, రాజ్యమా?’ అని శ్రీశ్రీ చెప్పినట్లుగా మారిన పరిస్థితుల్లో ఓట్లు, సీట్లతో కమ్యూనిస్టుల బలాన్ని అంచనా వేయలేమని పేర్కొన్నారు. త్యాగధనులు అరుదు కావచ్చు కానీ కరువు లేదని, కమ్యూనిస్టుల రూపంలో త్యాగధనులు సజీవంగానే ఉన్నారని తెలిపారు. కమ్యూనిస్టులకు బలమే లేదంటున్న వారు కమ్యూనిస్టులను చూసి ఎందుకు భయపడుతున్నారని అశోక్‌తేజ ప్రశ్నించారు. మోడీ, అమిత్‌షా ఎందుకు టార్గెట్లు విధించి మరణ శాసనం రాస్తున్నారో చెప్పాన్నారు.
పాటకు పదునెక్కువ..
వంద ఉపన్యాసాల కంటే ఓ పాట ప్రజలను ఎక్కువగా ఆలోచింపజేస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించేది కళా రూపాలేనని పేర్కొన్న ఆయన సాహిత్యం ప్రజా ఉద్యమాలకు దిక్సూచిగా ఉండాలన్నా రు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యయం అనేక ఒడుదొ డుకులను ఎదుర్కొన్నా అనేక విజయాలను సాధించిందని తెలిపారు. అనంతరం కవులను సత్కరించారు. అరసం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కేవీఎల్, కమిటీ కన్వీనర్ లెనిన్ శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి దండిసురేష్‌తో పాటు పల్లెర్లవీరస్వామి, రాపో లు సుదర్శన్, నిధి, సాధనాల వెంకటస్వామినా యుడు, రౌతు రవి, మువ్వా శ్రీనివాసరావు, సునంద, కొంపెల్లి రామయ్య, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, జమ్ముల జితేందర్‌రెడ్డి, శింగు నర్సింహారావు, సీహెచ్.సీతామహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


