నేడు ‘ఎత్తిపోతలు’ ప్రారంభం
● ‘మంచుకొండ’తో తీరనున్న రైతుల కల ● కృష్ణా జలాలకు స్వాగతం పలకనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం వీవీ. పాలెంలో సాగర్ కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ప్రారంభించనున్నారు. ఉదయం 10గంటలకు ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ప్రారంభిస్తారు. ఆతర్వాత మంచుకొండ డెలివరీ పాయింట్ వద్ద కృష్ణా జలాలకు స్వాగతం పలికి రైతులతో సమావేశం కానున్నారు.
చిరకాల కోరిక
ఎత్తిపోతల పథకం నిర్మాణంతో రఘునాథపాలెం మండల రైతుల చిరకాల కల నెరవేరనుంది. సాగర్ ప్రధాన కాలువ పక్కనే ప్రవహిస్తున్నా రఘునాథపాలెం మండలం ఎగువ ప్రాంతంలో ఉండడంతో పంటల సాగుకు భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యాన మండలానికి సాగర్ జలాలు అందించేలా మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జనవరి 13న ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయగా శరవేగంతో పనులు పూర్తిచేసి ఈ ఏడాది అదేరోజు ప్రారంభిస్తుండడం విశేషం. శంకుస్థాపన అనంతరం ఆరునెలల్లోనే ప్రాథమిక పనులన్నీ పూర్తిచేసి ట్రయల్‌రన్ విజయవంతంగా చేపట్టారు. ఇప్పుడు సబ్‌స్టేషన్ ఏర్పాటవడంతో మంగళవారం అధికారికంగా ప్రారంభిస్తున్నారు. మండలానికి సాగర్ జలాలు అందించేలా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి.
విజయవంతం చేయాలి
బీడు భూములను పచ్చగా మార్చే లక్ష్యంగా మంత్రి తుమ్మల కృషితో ఎత్తిపోతల పథకం సిద్ధమైందని ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకం ప్రా రంభోత్సవ ఏర్పాట్లను సోమవారం పరిశీలించాక ఆయన తుమ్మల యుగంధర్‌తో కలిసి మాట్లాడారు. పథకం ప్రారంభోత్సవానికి రైతులు, ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అధ్యక్షుదు నాగండ్ల దీపక్‌చౌదరి, నాయకులు మానుకొండ రాధాకిషోర్, సాధు రమేష్‌రెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు, తాతా రఘురాం, రావూరి సైదబాబు, వాంకుడోత్ దీపక్ పాల్గొన్నారు.


