మహిళ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
భార్య సోదరుడిని ఘటనలో భాగం చేసిన ప్రధాన నిందితుడు
ఖమ్మంక్రైం: ఖమ్మం కస్పాబజార్‌లో ఈనెల 9వ తేదీన మహిళను హతమార్చినఘటనలో ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశా రు. ఈమేరకు సీఐ కరుణాకర్ వెల్లడించిన వివరాలు.. భద్రాద్రి జిల్లా పాల్వంచ ప్రాంతానికి చెందిన మాడెం ప్రమీల– నరసింహారావు పాల్వంచలోని చాకలి బజార్‌లో బొమ్మ శ్రావణ్ ఇంట్లో నివాసం ఉండేవారు. వీరిద్దరు విడిపోయా క ప్రమీల భద్రాచలంలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా శ్రవణ్ తరచూ వెళ్లి వచ్చేవాడు. ఈనేపథ్యాన తనతో పాటు పనిచేసే కృష్ణ వద్ద శ్రవణ్‌కు రూ.లక్ష అప్పు ఇప్పించగా ఆ డబ్బు ఎంతకూ ఇవ్వకపోవడంతో అడుగుతుండగా మనస్పర్థలు పెరిగాయి. దీనికితోడు శ్రవణ్ ఆమెను లైంగికంగా వేధిస్తుండడంతో ఖమ్మం వచ్చి బట్టల షాప్‌లో పనిచేస్తూ మేదరబజార్‌లో జీవిస్తోంది. ఈక్రమాన తనను దూరం పెట్టి, నరసింహారావుతో మళ్లీ ఆమె మాట్లాడుతోందని శ్రవణ్ కక్ష పెంచుకున్నాడు. ఆమెను హతమార్చాలని నిర్ణయించుకుని తన భార్య సోదరుడైన గడిదాసు రాజేష్‌ను కలిశాడు. ప్రమీల కారణంగానే తమ సంసారంలో గొడవలు జరుగుతున్నాయని నమ్మించి హత్యకు ఒప్పించా డు. ఈక్రమంలో 9వ తేదీన ఇద్దరూ ద్విచక్రవాహనంపై పాల్వంచ నుంచి ఖమ్మం వచ్చి రాత్రి ఆమె షాపు నుంచి నివాసానికి వెళ్తుండగా అడ్డుకున్నారు. శ్రవణ్ ఆమెను గట్టిగా పట్టుకోగా రాజేష్ కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆపై ఎవరు గుర్తుపట్టకుండా ఆమె వద్ద గుర్తింపు కార్డు, స్మార్ట్ వాచ్, రక్తపు మరకలు అంటిన దుస్తులను తీసుకెళ్లి దూరంగా పడేశారు. అదేరోజు రాత్రి రాజేష్ పోలీసులకు చిక్కగా పరారీలో ఉన్న శ్రవణ్‌ను సోమవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.


