మాంజా మనకొద్దు..
గాలిపటాలు ఎగురవేసే
సింథటిక్ మాంజాలపై నిషేధం
మాంజా విక్రయించినా,
వినియోగించినా చర్యలు
సంక్రాంతి వేళ ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వ శాఖలు
ఖమ్మంగాంధీచౌక్: సంక్రాంతి అంటేనే సరదాల పండుగ. ఈ పండగ వేళ పిల్లలు మొదలు యువత, పెద్దల వరకు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పిల్లలు సంక్రాంతి పండుగను పతంగుల పండగ అని కూడా పిలుచుకుంటారు. సరదాగా ఎగుర వేసే ఈ గాలిపటాలను కొందరు పందేలుగా, పోటీలతో ఎగుర వేస్తున్నారు. ఈ పందేలు, పోటీలు ఎదుటి వారి గాలి పటాలను తెంచే విధంగా సాగుతున్నాయి. నూలు వంటి దారాలతో ఎగుర వేసే ఈ పతంగులను కాల క్రమంలో మాంజాలతో ఎగుర వేస్తున్నారు. చైనాలో నైలాన్, సింథటిక్ దారంతో ఈ మాంజాను తయారు చేస్తారు. ఈ మాంజా తయారీలో గాజును వాడుతారు. చైనా మాంజాలు పర్యావరణంతోపాటు మనుషులు, పక్షులు, జంతువుల ప్రాణానికి హానికరం. దీంతో ఈ మాంజాలను నిషేధించారు. అయినప్పటికీ ఈ మాంజాను వివిధ పరిశ్రమల్లో వినియోగం పేరిట విక్రయిస్తూనే ఉన్నారు. గుజరాత్, ఢిల్లీ, సూరత్, మీరట్, ముంబై ద్వారా దేశవ్యాప్తంగా విక్రయాలు జరుగుతున్నాయి. మాంజా నిషేధం ఉన్నప్పటికీ ఇక్కడ సంక్రాతి వేళ ఉన్న డిమాండ్ ఆధారంగా రహస్యంగా విక్రయాలు సాగుతూనే ఉన్నాయి.
నిషేధంపై ప్రచారం
జాతీయ హరిత ట్రిబ్యునల్, తెలంగాణ ప్రభుత్వం సింథటిక్/గ్రాసుతో తయారు చేసిన మాంజాలను నిషేధించింది. ఈ మాంజాలను తయారు చేసినా, విక్రయించినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వ శాఖలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. పోలీస్ శాఖ ఇప్పటికే మాంజాల విక్రయాలు, వినియోగంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో అక్కడక్కడా మాంజాలను గుర్తించి కేసులు కూడా నమోదు చేస్తున్నారు. హైదరాబాద్‌లో పెద్దసంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మన జిల్లాలో అటవీ శాఖ మాంజాల నిషేధంపై రూపొందించిన పోస్టర్ల ద్వారా ప్రచారం సాగిస్తోంది. జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ పక్షులకు, మానవాళికి ప్రమాదకరమైన, ప్రాణహానిని తలపెట్టే మాంజాలను వినియోగిస్తే చట్టపరమైన చర్య లు, శిక్షలు ఉంటాయని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రమాకరమైన మాంజాలను విక్రయించినా, వినియోగించినా కమాండ్ కంట్రోల్ నంబర్ 08742 295323కు ఫోన్ చేయాలని తెలిపారు. ప్రధానంగా తల్లితండ్రులు పిల్లలు గాలిపటాల కొనుగోళ్లు, ఎగుర వేయడంపై దృష్టి సారించాలని సూచించారు.
మాంజా మనకొద్దు..
మాంజా మనకొద్దు..


