చికిత్స పొందుతున్న కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న కూలీ మృతి

Jan 12 2026 7:37 AM | Updated on Jan 12 2026 7:37 AM

చికిత్స పొందుతున్న కూలీ మృతి

చికిత్స పొందుతున్న కూలీ మృతి

రఘునాథపాలెం: కడుపునొప్పి తాళలేక పురుగులమందు తాగిన కూలీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆదివారం రఘునాథపాలెం సీఐ ఉస్మాన్‌షరీఫ్‌ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లా బోకర్‌ తాలూకా దవరికు గ్రామానికి చెందిన అరవింద్‌ హరిరాథోడ్‌ (36) కూలీ పనుల నిమిత్తం భార్య అర్చనభాయ్‌తో కలిసి ఏటా రఘునాథపాలెం మండలం పుఠానితండాకు వస్తున్నాడు. ఈ క్రమంలో అరవింద్‌ రోజూ అధికంగా మద్యం సేవించేవాడని, తరచూ కడుపునొప్పి వస్తోందని భార్య వద్ద డబ్బులు తీసుకెళ్లి మద్యం తాగేవాడని తెలిసింది. శనివారం మధ్యాహ్నం తీవ్రంగా కడుపునొప్పి వస్తోందని వైద్యుడికి చూపించుకుంటానని భార్య అర్చన వద్ద రూ.500 తీసుకుని వెళ్లిన అరవింద్‌.. రాత్రి వచ్చాడు. పురుగులమందు వాసన రావడంతో భార్య విచారించగా.. పురుగులమందు తాగినట్లు చెప్పాడని, వెంటనే ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

కోడిపందేల స్థావరంపై దాడులు

తల్లాడ: మండలంలోని బాలాపేట శివారులో కోడిపందేల స్థావరాలపై ఆదివారం దాడులు నిర్వహించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపారు. నిందితుల నుంచి రూ.19,050నగదు, 4కోళ్లు, 12కత్తులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించా రు. కోడి పందేల నిర్వాహకుడు వేముల శ్రీనుపై గతంలో కూడా ఇలాంటి కేసు లు ఉన్నట్లు గుర్తించామని, ఇతడిపై సస్పెక్ట్‌ షీట్‌ తెరుస్తామని ఎస్‌ఐ వివరించారు. సీపీ ఆదేశాల మేరకు గతంలో కోడి పందేలు, జూదం నిర్వహించిన వారిని గుర్తించి బైండోవర్‌ చేస్తునట్లు పేర్కొన్నారు.

ఈజీ మనీ పేరుతో మోసం

కారేపల్లి పోలీసులకు ఏపీవాసుల ఫిర్యాదు

కారేపల్లి: ఈజీగా మనీ సంపాదించటంఎలా..? ఏటీఎం (ఎనీటైంమనీ) పేరుతో ఆన్‌లైన్‌లో 3 నెలల కోర్సు నేర్పిస్తా మని నమ్మబలికి, కోర్సు కోసం ఫీజు వసూలు చేసి తర్వాత తప్పించుకు తిరుగుతున్న ఓ యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన 9 మంది యువకులు ఆదివారం కారేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం కారేపల్లిలో నివాసం ఉంటున్న సదరు యూట్యూబర్‌ ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, ఆందోళనకు దిగారు. ‘బిగ్గెస్ట్‌ స్కామర్‌ ఇన్‌ తెలంగాణ స్టేట్‌.. బానోత్‌ సాయినాథ్‌’అని ఫ్లెక్సీలో రాశారు. సమాచారం అందుకున్న కారేపల్లి పోలీసులు ఆందోళనకారులకు సర్దిజెప్పారు. ఎస్‌ఐ బి.గోపిని వివరణ కోరగా.. ఆంధ్ర నుంచి 9 మంది యువకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని, యూట్యూబర్‌ వద్ద నుంచి తమ డబ్బులు ఇప్పిస్తేచాలని తెలిపారని చెప్పారు. బాధితులను ఆంధ్రలోని తమ పరిధిలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవాలని సూచించానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement