హరిదాసు వేషధారణతో ప్రచారం
కూసుమంచి: రహదారి ప్రమాదాల నివారణ, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై సూర్యాపేట జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త, ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ హరిదాసు వేషధారణతో అవగాహన కల్పించారు. ఆదివారం కూసుమంచిలో ఆయన ‘నో డ్రగ్స్.. సేవ్ లైఫ్’ నినాదంతో ప్రచారం చేపట్టారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, కన్న తల్లిదండ్రుల కలలను కల్లలు చేస్తున్నారని పేర్కొన్నారు. యువత సన్మార్గంలో పయనించాలని, ఆందుకు వారిలో మానసిక పరివర్తన కలగాలని పేర్కొన్నారు. వాహనదారులు రహదారి నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణకు బాధ్యత తీసుకోవాలన్నారు. కాగా, సమాజ హితానికి పాటుపడుతున్న ఆయన్ను పలువురు ఈ సందర్భంగా అభినందించారు.


