సాక్షి, బెంగళూరు: జనం ఊహించిన భయం నిజమైంది. ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయాలంటే మరింత ఖర్చు పెట్టుకోవాలి. సర్కారు బస్సు చార్జీలను పెంచేసింది. కేఎస్ ఆర్టీసీ, వాయువ్య, ఈశాన్య రవాణా సంస్థల్లో సగటున 23 శాతం, బెంగళూరులో బీఎంటీసీలో 18 శాతం నుంచి 50 శాతం వరకు చార్జీలను బాదింది. బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
45 శాతం పెంచాలన్నారు: మంత్రి
రవాణా శాఖ మంత్రి బైరతి సురేశ్ చార్జీల పెంపును మీడియాకు వివరించారు. రవాణా సంస్థలు సుమారు 38 శాతం మేర చార్జీలను పెంచాలని సర్కారును కోరాయన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి అతుల్ కుమార్ తివారీ కమిటీ రాష్ట్రంలో అధ్యయనం చేసి 45 శాతం పెంపునకు సిఫారసులు చేసిందని చెప్పారు. అయితే ప్రజల కోసం ఎక్కువ భారం పడకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బీఎంటీసీలో మరీ అధికం
వేగదూత బస్సుల్లో కనిష్టంగా రూ. 19, గరిష్టంగా రూ. 68 వరకు చార్జీలు పెరిగాయని మంత్రి తెలిపారు. పెంపు అనేది బెంగళూరువాసులపై అధికంగా ఉంటుంది. బీఎంటీసీ బస్సుల్లో రెండు కిలోమీటర్ల దూరానికి రూ.4, 2 నుంచి 4 కి.మీ. దూరానికి రూ. 6 మేర ధరలను పెంచామన్నారు. ఇక వాయువజ్ర బస్సుల్లో 6 కి.మీ దూరానికి రూ. 5, ఆపై 6–18 కి.మీ దూరానికి రూ.10 మేర అధికమైంది.
అన్నివైపులా సమస్యలున్నాయి
మంత్రి సురేశ్ చార్జీల పెంపును సమర్థించుకుంటూ గత పదేళ్లలో డీజిల్ ధరలు 10.47 శాతం పెరిగాయని, ఆర్టీసీ మొత్తం ఖర్చుల్లో 70 శాతం డీజిల్, ఉద్యోగుల వేతనాలకే వెళుతోందని చెప్పారు. డీజిల్ ధరల పెంపు వల్ల ఏటా రూ. 500 కోట్ల మేర అదనపు భారం పడుతోందన్నారు. డీజిల్ సరఫరా సంస్థలకే రూ.1,111 కోట్లు బాకీలు పడ్డామని గుర్తు చేశారు. 2024లో ఉద్యోగుల జీతాలు పెరిగాయని, దానివల్ల కూడా రవాణా సంస్థపై భారీగా ఆర్థిక భారం పడిందని చెప్పారు. ‘పెండింగ్ బకాయిలు, నిర్వహణ ఖర్చులు అధికమయ్యాయి. 2021లో శ్రీనివాసమూర్తి కమిటీ కాలక్రమేణా తరచూ టికెట్ ధరలను పెంచాలని సిఫారసులు చేసింది. అతుల్ తివారీ కమిటీ కూడా పెంపును సమర్థిస్తూ నివేదికను సమర్పించింది. 2024లో చివరిసారి చార్జీలను పెంచాం‘ అని తెలిపారు. ఆర్టీసీ సుస్థిరత కోసం చార్జీల భారం తప్పదని అన్నారు.
రాష్ట్రంలో మొత్తం 26,125 ఆర్టీసీ బస్సులు సేవలందిస్తున్నట్లు, 1,03,646 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు మంత్రి సురేశ్ తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి రవాణా సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, డీజిల్ ధరలు, ఉద్యోగుల జీతభత్యాలు పెరగడం వల్ల గత్యంతరం లేకపోయిందని చెప్పారు. డీజిల్ కొనుగోలునకు ఏటా రూ. 5,694 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు రవాణా సంస్థలు ఏటా సుమారు రూ.16 వేల కోట్ల ఖర్చులు చేస్తున్నాయని, ఆదాయం రూ.14 వేల కోట్లు మాత్రమే ఉంటోందని తెలిపారు. ఇలా ఏటా రూ.2 వేల కోట్ల లోటు ఏర్పడుతోందని, ఏటేటా రుణ భారం కూడా విస్తరిస్తోందని వాపోయారు. మహిళలు చేసే ఉచిత బస్సు ప్రయాణాలకు ప్రభుత్వం ఆర్టీసీకి చార్జీలను చెల్లిస్తోందని తెలిపారు.
కేఎస్ ఆర్టీసీలో 23 శాతం, బీఎంటీసీలో 50 శాతం వరకూ చార్జీల పెంపు
ప్రకటించిన రవాణా మంత్రి బైరతి సురేశ్
నష్టాలను భరించలేకే అని వెల్లడి
తక్షణం అమల్లోకి కొత్త రేట్లు
తప్పదు, భరించాల్సిందే:
సీఎం డీకే శివ
సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ ‘బస్సులకు డీజిల్ భర్తీకి కూడా డబ్బులు లేవు. పెరిగిన డీజిల్ ధరల వల్ల బాగా నష్టం వస్తోంది. ఒక్కో స్టేజ్‌లో రూ. 2–3 పెంచాల్సి ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతిపక్షాలు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. డీజిల్ ధరలపై మౌనమెందుకు? కేంద్రం డీజిల్ రేట్లు తగ్గిస్తే బస్సు చార్జీలను మేము తగ్గిస్తాం’ అని చెప్పారు.


