దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాలకు చెందిన విద్యార్థి పరీక్షా కేంద్రానికి ఏఐ గ్లాస్ వచ్చి దొరికిపోయాడు. వివరాలు.. పరీక్షలు జరుగుతుండగా, మంగళవారంనాడు ఓ విద్యార్థి మోసపూరితంగా ఏఐ సాంకేతికత కలిగిన అద్దాలను పెట్టుకుని వచ్చాడు. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు ఆ గ్లాసెస్ ద్వారా జవాబులను కనుక్కోవాలనుకున్నాడు. అనుమానం వచ్చి ఇన్విజిలేటర్ పరిశీలించగా అది ఏఐ స్మార్ట్ కళ్లద్దాలుగా తేలింది. దీంతో అతన్ని పై అధికారులకు అప్పగించారు. ఆ గ్లాస్ ధర రూ.34 వేలని తెలిసింది. అతన్ని డీబార్ చేశారు.
పసిపిల్లల నోట్లో మట్టి
● అంగన్‌వాడీ సరుకుల దొంగ రవాణా
మైసూరు: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల నోట్లోకి చేరాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మైసూరు ఎన్‌ఆర్ స్టేషన్ పోలీసులు పట్టుకున్నారు. ఉదయగిరి వద్ద నిన్నా మసీదు రోడ్డులోని అంగన్‌వాడీ కేంద్రం ఆహార పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నట్లు శిశు అభివృద్ధి యోజనాధికారి అభికుమార్‌కు సమాచారం అందగా పోలీసులతో కలిసి దాడి చేశారు. ఓ గూడ్స్ ఆటోను అడ్డుకోగా, ఆటోని అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. ఆటోని తనిఖీ చేయగా 29 కేజీల చక్కెర, 95 ప్యాకెట్ల పాల పొడి, 37 ప్యాకెట్ల పెసరపప్పు, 96 కేజీల పుష్టి పౌడర్, 60 కేజీల మిల్లెట్ లడ్డూ, 20 కేజీల సారవర్థకం బయటపడ్డాయి. అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది కుమ్మక్కయినట్లు తెలుస్తోంది. వాటిని బయట మార్కెట్లలో అధిక రేట్లకు అమ్మి సొమ్ము చేసుకునేవారని అనుమానాలున్నాయి. నిందితుల కోసం విచారణ చేపట్టారు.
ప్రదోష్‌కు షరతుల బెయిల్
● ఉదయం బయటకు వెళ్లి సాయంత్రం జైలుకు రావాలి
యశవంతపుర: తీవ్ర సంచలనాత్మక చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న 14వ నిందితుడు, అప్రూవర్ ప్రదోష్‌కు హైకోర్టు బెయిలిచ్చింది. తన తండ్రి వార్షిక పుణ్యతిథి కోసం బెయిలు కావాలని అర్జీ దాఖలు చేయగా న్యాయమూర్తి అనంత్ రామనాథ్ హెగ్డే ఆమోదించారు. ప్రదోష్‌కు బెయిల్ ఇవ్వవద్దని 2వ నిందితుడు, నటుడు దర్శన్ తరఫున న్యాయవాది తీవ్రంగా వాదనలు చేసినా ఫలించలేదు. ఈ నెల 7 నుంచి 12 వరకు ప్రదోష్‌కు షరతులతో కఠిన బెయిలు మంజూరైంది. రోజూ ఉదయం 8 గంటల జైలు నుంచి బయటకు వెళ్లి, సాయంత్రం 6 గంటలకు మళ్లీ జైల్లోకి చేరాలని జడ్జి ఆదేశించారు. ఆయన వెంట పోలీసు బెటాలియన్ కాపలాగా ఉంటుంది. పుణ్యతిథికి వచ్చే వ్యక్తులు, పురోహితుల వివరాలను ఇవ్వాలని జడ్జి సూచించారు. బంధువులతోను, ఇతరులతోనూ మాట్లాడకుండా కార్యక్రమం చేసుకోవాలని స్పష్టం చేశారు.
రూ.40 కోట్లతో...
సాహుకార్ ప్లాన్
యశవంతపుర: కేపీఎస్‌సీ ఉద్యోగాల బాగోతంలో నిందితుడు, ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్ సంపాదించిన ఆస్తులపై ఆశ్చర్యకర సంగతులు బయటపడుతున్నాయి. సుమారు రూ.40 కోట్ల వ్యయంతో భారీ పెట్టుబడి పథకాన్ని సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇంటిలో లభించిన పత్రాల ఆధారంగా యాదగిరి జిల్లా మాదర్కి గ్రామంలో 8 ఎకరాలలో ప్రైవేటు పాఠశాల, కాలేజీతో పాటు ఆస్పత్రి, రెస్టారెంట్‌ను నిర్మించాలని బ్లూప్రింట్‌ను రూపొందించాడు. కేపీఎస్‌సీ ద్వారా ఆర్జించిన సొమ్మును ఇలా ఉపయోగించాలని అనుకున్నాడు.
బెంగళూరులో భారీ వర్షం
దొడ్డబళ్లాపురం: గత కొన్ని రోజులుగా బెంగళూరులో సెలవు తీసుకున్న వరుణుడు బుధవారంనాడు గర్జించాడు. ఉదయం నుంచి మెజెస్టిక్, మైసూరు బ్యాంక్ సర్కిల్, కార్పొరేషన్ సర్కిల్, విధానసౌధ, కేఆర్ సర్కిల్ చుట్టుపక్కల వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో పనుల కోసం బయటకు వచ్చిన జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బెంగళూరు, దక్షిణ ప్రాంత జిల్లాలకు మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ప్రకటించారు. రామనగర జిల్లాలోనూ వర్షాలు కురిశాయి.


