పరిషత్‌ పోరు ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ పోరు ప్రశాంతం

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

శివాజీనగర: విధాన పరిషత్‌లోని నాలుగు స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఓటింగ్‌ దృష్ట్యా పోలింగ్‌ బూత్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బెంగళూరు నాగరబావిలో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కర్ణాటక ఆగ్నేయ పట్టభద్ర నియోజకవర్గానికి సంబంధించి కోలారు, చిక్కబళ్లాపురం, తుమకూరు, చిత్రదుర్గ, దావణగెరె జిల్లాల్లో పోలింగ్‌ జరిగింది. అదేవిధంగా కర్ణాటక పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ధార్వాడ, గదగ్‌, హావేరి, ఉత్తర కన్నడ జిల్లాల్లో పోలింగ్‌ జరిగింది. ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి కలబురిగి, బీదర్‌, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాల్లో పోలింగ్‌ కొనసాగింది. బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి బెంగళూరు అర్బన్‌, బెంగళూరు రూరల్‌, రామనగర జిల్లాల్లో పోలింగ్‌ జరిగింది. గదగ్‌ జిల్లాలోని 27 పోలింగ్‌ బూత్‌ల్లో సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తుమకూరు ఆగ్నేయ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో ఓటర్లు పోటెత్తారు. జిల్లాలో 80 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,060 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల దృష్ట్యా ఆయా జిల్లాల్లోని ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.

బెంగళూరులో ఓటింగ్‌

బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని నాగరబావి అంబేడ్కర్‌ కళాశాల పోలింగ్‌ బూత్‌ సమీపంలో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిసింది. మాజీ కార్పొరేటర్‌ మోహన్‌ కుమార్‌ ఇతరులను అవమానించారని ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఈశాన్యంలో ఉత్సాహంగా..

విధాన పరిషత్‌ ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్‌లో రాయచూరులో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. రాయచూరులో మొత్తం 16 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. సహాయ రిటర్నింగ్‌ అధికారిగా కూడా ఉన్న డిప్యూటీ కమిషనర్‌ పూవిత వివిధ పోలింగ్‌ బూత్‌లను సందర్శించి తనిఖీ చేశారు.ఈనెల 27న ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడిస్తారు.

కలబుర్గిలో పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

బరిలో ఉన్న అభ్యర్థులు వీరే..

కర్ణాటక పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గం:

ఎస్‌.వీ.సంకనూరు(బీజేపీ)

మోహన్‌ లింబికాయి(కాంగ్రెస్‌)

కర్ణాటక ఆగ్నేయ నియోజకవర్గం:

శశి హులికుంటెమఠ(కాంగ్రెస్‌)

కేఎం సురేష్‌(బీజేపీ)

ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గం:

శశిలా నమోషి(బీజేపీ)

శరణప్ప మట్టూరు(కాంగ్రెస్‌)

బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గం:

పుట్టణ్ణ(కాంగ్రెస్‌)

ఏ.పీ.రంగనాథ్‌(జేడీఎస్‌)

నాలుగు విధాన పరిషత్‌

స్థానాలకు ఎన్నికలు

ఓటు వేసేందుకు పోటెత్తిన ఉపాధ్యాయులు, పట్టభద్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement