రాయచూరు రూరల్: ‘ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అవకతవకలు జరిగాయి. అర్హులైన ఓటర్లు ఓటుహక్కు కోల్పోయారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి’ అని సంయుక్త పోరాట సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం నగరంలోని టిప్పు సుల్తాన్ ఉద్యాన వనంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సమితి సంచాలకుడు వీరేష్ మాట్లాడుతూ.. అర్హులైన ఓటర్ల పేర్లను ఏకపక్షంగా తొలగించారని ఆరోపించారు. సర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కోరారు. అర్హులైన వారి పేర్లను ఓటరు జాబితా చేర్చాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నిరసన..
రాయచూరు రూరల్: ‘సర్’ పేరుతో ఓట్లను దారుణంగా తొలగిస్తున్నారని విధాన పరిషత్ సభ్యుడు బోసురాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. సర్ ప్రక్రియ తప్పులతడకంగా మారిందని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు నేతాజీ నగర్ సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శాంతప్ప, శాలం, అమరేగౌడ, రుద్రప్ప, శివమూర్తి, ఆంజనేయ, నిర్మల, వందన తదితరులు పాల్గొన్నారు.
బళ్లారి రూరల్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేసి, ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి’ అని బళ్లారి ఎస్‌ఐఆర్ విరోధ జనసంఘాలు, పక్షేతర పార్టీల ఐక్యసంఘ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఎస్‌ఐఆర్‌ను ఏర్పాటు చేసి 13 కోట్ల మంది ఓటర్లను తొలగించిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకం అని తెలిపారు. అధికారం కోసం మోదీ, అమిత్‌షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న యువతను అక్రమంగా అరెస్ట్ చేసి గొంతెత్తకుండా చేస్తున్నారని తెలిపారు. 2023 కర్ణాటక ఎన్నికల అనంతరం ఎస్‌ఐఆర్ పేరుతో దళితులు, మైనారీటీలు, పేదల ఓట్లను తొలిగించి అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మోదీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. అనంతరం జిల్లా అధికారికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు రాయల్ సర్కిల్ గాంధీభవన్ నుంచి పాతడీసీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది.
పేపర్ బ్యాలెట్ విధానం అమలు చేయాలి
హొసపేటె: సర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేసి, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రగతిశీల సంస్థలు డిమాండ్ చేశాయి. శుక్రవారం హోస్పేట్‌లోని అంబేడ్కర్ సర్కిల్ నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సర్ రద్దు చేయాలని నిరసన
సాక్షి, బళ్లారి: సర్ రద్దు చేయాలని కోరుతూ కిసాన్ మోర్చా రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ భవన్ నుంచి జిల్లా అధికారి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. దారిపొడవునా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. తక్షణం ఎన్నికల కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి, దళిత సంఘం నాయకుడు, ఎద్దేళు కుమార సమత పాల్గొన్నారు.


