నిత్యావసరాల పంపిణీలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

నిత్యావసరాల పంపిణీలో నిర్లక్ష్యం వద్దు

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

రాయచూరు రూరల్‌: చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాలను సకాలంలో అందజేయాలని ఆహార, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి నజీర్‌ అహ్మద్‌ ఆదేశించారు. శుక్రవారం నగరంలోని పలు చౌకధరల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్‌కార్డు దారుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. నిత్యావసరాల పంపిణీ విషయంలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రేషన్‌కార్డులకు వంద శాతం ఈ–కేవైసీ చేయించాలని పేర్కొన్నారు.

రైలు కిందపడి

యువకుడి మృతి

హుబ్లీ: రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కుందగోళ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. కుందగోళ మౌనేశ్వర ప్లాట్‌ నివాసి రాజేసాబ్‌ (35) మృతుడు. అవివాహితుడైన ఇతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. రాజేసాబ్‌ రైలు కిందపడటంతో శరీరం ముక్కలుగా విడిపోయింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వేతనాలు

సక్రమంగా చెల్లించాలి

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో విబీ–జీ రామ్‌జీ పథకం కింద తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని బిజినిగేరకు చెందిన కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అధికారులు, ఇంజినీర్లు, పీడీఓలు చేసిన పనికి సక్రమంగా వేతనాలు చెల్లించకుండా తక్కువ మొత్తం ఇస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రతి 15 రోజులకు నిర్వహించాల్సిన వైద్య పరీక్షలు, చికిత్సలను అడ్డుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఈశ్వర్‌ కుమార్‌ కాందూకు వినతిపత్రం అందజేశారు.

బంగారు ఆభరణాల చోరీ

హుబ్లీ: ఇంట్లోని అల్మారాలో దాచిన రూ.1.80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. ఈ ఘటన హుబ్లీ మూరుసావిర మఠం సమీపంలోని ఓ ఇంట్లో జరిగింది. రేణుక అనే మహిళ ఇంట్లో ఎవరు లేని వేళ చొరబడిన దొంగలు.. 18 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని ఉడాయించారు. ఈ ఘటనపై కమరిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నగ్నంగా వ్యక్తి హల్‌చల్‌..

హుబ్లీ: ధార్వాడ సప్తాపుర లేఅవుట్‌లో మహిళల పీజీ కేంద్రంలోకి ఓ వ్యక్తి నగ్నంగా చొరబడి అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన అమ్మాయిలు ధార్వాడ ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి రాత్రి వేళల్లో నగ్నంగా పీజీ హాస్టల్‌లోకి ప్రవేశిస్తున్నాడు. ఆ వ్యక్తి రాకపోకలన్నీ అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అక్కడ ఆరవేసిన యువతుల లోదుస్తులను చోరీ చేసేవాడని తెలిసింది. ఇప్పటికై నా ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయాలని హాస్టల్‌ విద్యార్థినులు డిమాండ్‌ చేశారు.

చట్టాలపై

అవగాహన తప్పనిసరి

రాయచూరు రూరల్‌: పాఠశాలల్లో లైంగిక దాడుల నియంత్రణ, పోక్సో చట్టంపై పిల్లలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బసప్ప బాళప్ప ఝకాతి తెలిపారు. శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రాష్ట్ర, జిల్లా న్యాయ సేవా ప్రాధికార, న్యాయవాదుల సంఘం, విద్యాశాఖ ఆధ్వర్యంలో న్యాయ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. పిల్లలు లైంగిక వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోక్సో చట్టం ద్వారా కఠిన శిక్షలు విధించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులు శశిధర్‌శెట్టి, సిద్రామప్ప, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శివశంకర్‌, రాఘవేంద్ర, శ్రీనివాస్‌, బీఈఓ ఈరణ్ణ, కాత్యాయని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement