● యాదగిరి జిల్లాలో వింత ఘటన
రాయచూరు రూరల్: కర్ణాటకలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నల్లటి రంగులో ఉన్న ఓ బర్రె పూర్తిగా తెల్లటి రంగులో ఉన్న దూడకు జన్మనిచ్చింది. తల్లి బర్రె నల్లగా ఉంటే.. దూడ మాత్రం తెల్లగా ఉండటంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా.. యాదగిరి జిల్లా హుణిసిగి తాలుకా నారాయణపుర గ్రామానికి చెందిన పరుశురామ్ బరెన్రు పోషిస్తున్నాడు. సుమారు 10 నెలల గర్భధారణ తర్వాత బుధవారం రాత్రి తెల్లని రంగులో దూడ జన్మించింది. ఈ వింత దూడ గురించి తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దాన్ని చూసేందుకు రైతు ఇంటికి తరలివస్తున్నారు. విషయం తెలుసుకున్న వెటర్నరీ సిబ్బంది నారాయణపుర గ్రామానికి చేరుకుని తెల్లని రంగులో ఉన్న దూడను పరిశీలించారు. రక్తనమూనాలు సేకరించి పరిశీలన నిమిత్తం బెంగళూరుకు పంపించారు. అక్కడి నుంచి రిపోర్టులు వచ్చాక పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని వెటర్నరీ సిబ్బంది తెలియజేశారు.


