హుబ్లీ: గతంలో విధాన పరిషత్‌కు అనుభవం ఉన్న వారు ఎన్నికై వచ్చేవారు. ఇటీవల విధాన పరిషత్ ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా తయారయ్యాయని సీనియర్ నేత, ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఫాతిమా హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించే అభ్యర్థులు కూడా డబ్బు ఇచ్చి ఓట్లు పొందడం శోచనీయం అన్నారు. ఉపాధ్యాయులు ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా యోగ్యుడైన అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. పట్టభద్రుల స్థానం ఎన్నికలకు ప్రతిసారి కొత్తగా పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ సరికాదని అభిప్రాయపడ్డారు. ఒక్కసారి డిగ్రీ పొందిన వారు జీవితాంతం పట్టభద్రులుగానే ఉంటారని గుర్తు చేశారు. స్టింగ్ ఆపరేషన్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.


