మండ్య: విజయదశమి పర్వదినానికి ముందుగానే జంబూసవారీ ఊరేగింపు ప్రజలను, భక్తులను పరవశుల్ని చేసింది. మేళతాళాలు, జనసాగరం మధ్య గజరాజు అమ్మవారి అంబారీని మోస్తూ ఊరేగింది. మండ్య జిల్లాలోని చారిత్రాత్మక శ్రీరంగపట్నంలో సంప్రదాయరీతిలో దసరా మహోత్సవం సాగింది. ఐదారు రోజులు ముందే జంబూసవారీ సంబరాన్ని అట్టహాసంగా జరిపారు. దసరా ఏనుగు ధనంజయ అంబారీని మోయగా, లక్ష్మి, రూప ఏనుగులు వెంట వచ్చాయి. పవిత్ర కుంభలగ్నంలో గురువారం మధ్యాహ్నం 3:35 గంటలకు కిరంగూరు బన్నిమంటపం సమీపంలో, ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు రవిచంద్రన్ ముఖ్య అతిథిగా వేడుకకు నాంది పలికారు. అమ్మవారి అంబారీపై పూలు చల్లి పూజలు చేశారు.
కనులపండువగా
వేదబ్రహ్మ డాక్టర్ భానుప్రకాష్ శర్మ నేతృత్వంలో గణపతి హోమం, దుర్గా సప్తసతి సహా పలు హోమాలు నిర్వహించి సిద్ధం చేశారు. ఎమ్మెల్యే ఎ.బి.రమేష్ బండిసిద్దే గౌడ, భార్య సుమతి ఈ పూజల్లో పాల్గొన్నారు. బన్ని మంటపం నుంచి బయలుదేరిన అంబారీ ఊరేగింపు కిరంగూరు, బాబురాయనకొప్పలు, బెంగళూరు–మైసూరు జాతీయ రహదారి మీదుగా శ్రీరంగపట్నం ప్రధాన ద్వారంలోకి ప్రవేశించింది. ఇరువైపులా వేలాదిగా ప్రజలు వీక్షిస్తూ జయజయధ్వానాలు చేశారు. శ్రీ రంగనాథస్వామి ఆలయం వద్ద సమాప్తమైంది. పోలీసు బ్యాండు, జానపద కళాకారుల ప్రదర్శనలు మరింత శోభ తెచ్చాయి. మంత్రులు ఎన్.చలువరాయస్వామి, పి.ఎం.నరేంద్రస్వామి, హెచ్.సి. బాలకృష్ణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చారు.
శ్రీరంగపట్నంలో దసరా అట్టహాసం


