నన్ను స్టింగ్‌ కేసులో ఇరికించే కుట్ర: కుమారస్వామి | - | Sakshi
Sakshi News home page

నన్ను స్టింగ్‌ కేసులో ఇరికించే కుట్ర: కుమారస్వామి

Oct 16 2026 7:29 AM | Updated on Oct 16 2026 7:29 AM

● పోలీసు కమిషనర్‌ ఆఫీసులో ధర్నా, భారీ హైడ్రామా

బనశంకరి: స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో తనను ఈ కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. గురువారం ఈ విషయమై బెంగళూరులో హైడ్రామా నడిచింది. ఆయన మొదట జేడీఎస్‌ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో ఓ మహిళను వాడుకుని మాజీ మంత్రి హెచ్‌డీ.రేవణ్ణను కేసులో ఇరికించినట్లు తనను కూడా లాగేప్రయత్నం చేస్తున్నారు, హోంమంత్రి ప్రియాంక్‌ ఖర్గేకు సవాల్‌ చేస్తున్నా, నన్ను టచ్‌ చేసి చూడు అని మండిపడ్డారు. మాజీ సీఎం సిద్దరామయ్య ఆడియో కేసులో విచారణకు హాజరైన వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో దర్జాగా ఉన్నాడని, డీసీపీ ఆఫీసులో కాలుపై కాలు వేసుకుని కూర్చుకున్నాడని తెలిసిందన్నారు. తరువాత ఆయన పోలీస్‌ కమిషనర్‌ ఆఫీసుకు వెళ్లి కమిషనర్‌ సీమంత్‌కుమార్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. స్టింగ్‌ కేసులో లోతుగా దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసి అక్కడే ధర్నా నిర్వహించారు. నేను కమిషనర్‌ కార్యాలయానికి వచ్చానని, హోంశాఖ ఎవరి ఆస్తికాదని ప్రియాంక్‌ ఖర్గేపై ధ్వజమెత్తారు. ఏఐసీసీ నేత రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా జతలో ఉన్న వ్యక్తిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, ఈ కేసులో తన పేరు చెప్పాలని డిమాండ్‌ చేశారన్నారు. సీఎం డీకే.శివకుమార్‌ మొబైల్‌ఫోన్‌ను విచారణకు అప్పగించాలన్నారు.

పోలీసు, కుమార్తె దుర్మరణం

● బైక్‌ మీద దూసుకెళ్లిన లారీ

దొడ్డబళ్లాపురం: బైక్‌ను లారీ వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో తండ్రి,కుమార్తె దుర్మరణం చెందిన విషాద ఘటన బెళగావి జిల్లా నిప్పాణి శివారులో జరిగింది. వివరాలు.. హుక్కేరి తాలూకా ఉళ్లాగడ్డి ఖానాపురకు చెందిన పుండలీక హట్టి (50), కూతురు నిఖిత (24), పుండలీక నిప్పాణి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. పని మీద కుమార్తెతో కలిసి బైక్‌పై వెళ్తుండగా స్పీడ్‌ బ్రేకర్‌ రావడంతో నిదానం అయ్యాడు, ఇంతలో వెనుక వేగంగా వస్తున్న లారీ వీరిని ఢీకొని వారి మీద నుంచి దూసుకెళ్లింది. దీంతో తండ్రీ కూతురు తీవ్ర గాయాలతో క్షణాల్లో దుర్మరణం చెందారు. నిప్పాణి పోలీసులు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. పని చూసుకుని తిరిగి వస్తామన్న భర్త, కూతురు చనిపోయారని తెలిసి తల్లి బోరున విలపించింది.

రిజర్వేషన్లపై సుప్రీంకు సర్కారు!

దొడ్డబళ్లాపురం: ఎస్సీ ఎస్టీ వర్గాలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్‌లను 56 శాతానికి ప్రభుత్వం పెంచడాన్ని ఇటీవల హైకోర్టు రద్దు చేయడం తెలిసిందే. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరిమితికి మించి పెంచడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లను కొనసాగింపును కోరుతూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement