శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది, ఆర్థిక శాఖను నిర్వహించడంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విఫలమయ్యారు, తక్షణమే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల మూడోరోజైన బుధవారం విధానసౌధ ముందు ధర్నా నిర్వహించారు. బీజేపీ సీనియర్లు ఆర్.అశోక్, చలవాది నారాయణస్వామి, బీ.వై.విజయేంద్ర తదితరులు కెంగల్ హనుమంతయ్య విగ్రహం వద్ద నిరసనకు దిగారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని అందరూ ఖాళీ కప్పులు, కొబ్బరి చిప్పలు పట్టుకున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని రాష్ట్ర ఆర్థిక శాఖే స్వయంగా లేఖ రాసింది, ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆర్థిక శాఖపై సీఎం డీ.కే.శివకుమార్‌కు ఎలాంటి నియంత్రణ లేదు. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని నినాదాలు చేశారు.
రాజీనామా చేయాలి
ఆర్.అశోక్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆర్థిక శాఖను నిర్వహించలేకపోతున్నారని అన్నారు. ఇది ఒక అసమర్థ ప్రభుత్వం. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యాన్ని కోల్పోయిందని, దివాళాపై తక్షణం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కోరారు. డీ.కే.శివకుమార్ అభివృద్ధి పనులకు రూ.32 వేల కోట్లు ప్రకటించారు, కానీ సర్కారుతో డబ్బు లేదు, 5 నెలలుగా పేదలకు పింఛన్లు అందలేదు, ఉపాధ్యాయులకు జీతాల్లేవు అని పలు ఆరోపణలు గుప్పించారు. విజయేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లకు పైగా కొత్త రుణాలు తీసుకుంది. రాష్ట్ర మొత్తం రుణం రూ.8 లక్షల కోట్లకు పెరిగింది, అప్పులు తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి దిగజారి దివాళా తీసిందని, ప్రభుత్వం ఐసీయూలో ఉందని దుయ్యబట్టారు.
అసెంబ్లీలో
తిరిగి విధానసభలో బీజేపీ నేతలు ఇదే మాదిరి ఆరోపణలతో సర్కారుపై ఆరోపణలు సంధించారు. సీఎం డీకే శివకుమార్ రాష్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రాంతాలవారీ ప్రగతికి పెద్దపీట వేసినట్లు తెలిపారు.
నేటి వరకూ సభ
శాసనసభ సమావేశాలను ఒక రోజు పొడిగించారు. మొదట 3 రోజులే అని నిర్ణయించారు. అయితే కస్తూరిరంగన్ నివేదికపై చర్చకే ఒకటిన్నర రోజుకు పైగా పట్టినందున, కరువు పరిస్థితిపై మరింత చర్చ కోసం గురువారం సాయంత్రం వరకు విస్తరించారు.
మాట్లాడుతున్న అశోక్, సీఎం డీకే
ఎమ్మెల్యే రూపా శశిధర్ ఆగ్రహం
విధానసభలో గొడవ దృశ్యం
డీకే సర్కారుపై బీజేపీ దాడి
ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రానికి డిమాండ్
అసెంబ్లీ ముందు నిరసన
సభలోనూ అదే మాటల యుద్ధం
కరువు నివారణలో విఫలం: విజయేంద్ర
దొడ్డబళ్లాపురం: వాతావరణ శాఖ ముందుగానే వర్షాభావం గురించి హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని, కరువును ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శించారు. అసెంబ్లీలో కరువు చర్చలో మాట్లాడారు. ఒకవేళ కరువు లేకున్నా, ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పంప్‌సెట్‌లకు విద్యుత్ అందించే పరిస్థితిలో లేదన్నారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నా యూనిట్‌కి రూ.14 నుంచి రూ.15 ఇచ్చి కొంటోందని ఆరోపించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద వచ్చిన రూ.1,229 కోట్లలో రూ.187 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. 45 శాతం వర్షమాపన యంత్రాలు పని చేయడం లేదన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో 70 శాతం సిబ్బందిని నియమించలేదన్నారు. ఏధంగా చూసినా ప్రభుత్వం కరువు పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తోందన్నారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో మూడు వేల మందికిపై పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
శివాజీనగర: శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. కోలారు జిల్లాలోని బంగారుపేట ఎమ్మెల్యే నారాయణస్వామి, కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపా శశిధర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. వివాదం ఎలా మొదలైందంటే.. ఎమ్మెల్యే నారాయణస్వామి, బాగేపల్లి ఎమ్మెల్యే ఎస్.ఎన్.సుబ్బారెడ్డి పక్కపక్కనే కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వెనుక సీటు నుంచి రూపా వచ్చి చేయి చూపిస్తూ నారాయణ స్వామితో కోపంగా మాట్లాడారు. ఈ ఘర్షణకు కచ్చితమైన కారణం ఏమిటని తెలియరాలేదు. తన గురించే ఏదో మాట్లాడుతున్నాడని ఆమె అనుమానించడమే కారణమై ఉంటుందని అనుకుంటున్నారు. రూపా టేబుల్‌పై చేత్తో కొడుతూ హెచ్చరికలు, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కనిపించింది. ఆ సమయంలో మంత్రి, ఆమె తండ్రి మునియప్ప కూడా సభలో ఉన్నారు. బీజేఎల్పీ నేత అశోక్ స్పందిస్తూ.. చూడండీ.. అక్కడొక గొడవ జరుగుతోంది, మౌనంగా ఉండమ్మా, వారిని కొట్టవద్దు అని వ్యంగ్యంగా అన్నారు. ఈ రభస అందరి దృష్టినీ ఆకర్షించింది. ఏం జరిగిందో అని ఆసక్తిగా వీక్షించారు. ఒకే జిల్లా, ఒకే పార్టీ ఎమ్మెల్యేల రగడ తీవ్ర చర్చనీయాంశమంది.


