అన్ని రంగాల్లో బెంగళూరు ముందంజ | - | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో బెంగళూరు ముందంజ

Jul 24 2026 1:09 AM | Updated on Jul 24 2026 1:09 AM

బనశంకరి: కర్ణాటక ప్రతిభావంతులైన మానవ వనరుల తయారీ కేంద్రం. ఇక్కడ ఉన్న మానవ వనరులు, వాతావరణం, సంస్కృతికి దేశంలోని ఇతర నగరాలు సాటిరావని సీఎం డీకే.శివకుమార్‌ తెలిపారు. గురువారం తుమకూరు రోడ్డులోని బెంగళూరు అంతర్జాతీయ వస్తుప్రదర్శన కేంద్రంలో నిర్వహించిన రక్షణ, ఏరోస్పేస్‌ రంగం 15వ స్ట్రాటిజిక్‌ ఎలక్ట్రానిక్స్‌ సమ్మిట్‌లో సీఎం డీకే.శివకుమార్‌ పాల్గొని మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్‌ కేవలం నగరాలకు పరిమితం కాలేదని, ప్రతి చిన్నారి చేతిలో ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లు వచ్చాయని తెలిపారు. కర్ణాటకలో 250 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా ప్రతి ఏడాది లక్ష మందికి పైగా ఇంజనీరింగ్‌ విద్యార్థులను తయారు చేస్తున్నాయన్నారు. అందువల్లే నెహ్రు బెంగళూరులో రక్షణ రంగం ఉత్పత్తులు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, హెచ్‌ఏఎల్‌, ఇస్రో, ఐఐటీ, బీహెచ్‌ఈఎల్‌తో పాటు ప్రముఖ సంస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు.

ఎలక్ట్రానిక్స్‌, ఏరో స్పేస్‌, రక్షణ రంగాల్లో పేరు

బెంగళూరు ఎలక్ట్రానిక్స్‌, ఏరో స్పేస్‌, రక్షణ రంగాలకు పేరుగాంచిందన్నారు. దేశభద్రత విషయంలో ఎలక్ట్రానిక్స్‌ చాలా ప్రముఖమన్నారు. దేశభద్రత కోసం పని చేస్తున్న మీరు, మనమంతా ఒక బృందంగా ముందుకు సాగాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనల్లో కర్ణాటక అగ్రస్థానంలో ఉందన్నారు. రక్షణ రంగంలో పని చేసే పారిశ్రామికవేత్తలకు రూ.25 కోట్ల సబ్సిడీ అందించడానికి ముందుకు వచ్చిన రక్షణ శాఖ నిర్ణయం హర్షనీయమన్నారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. భారత్‌లో ఏరోస్పేస్‌ రంగం విస్తృతంగా ఎదుగుతుంది. మనం దేశ భవిష్యత్‌, ప్రపంచ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ముందున్నామని తెలిపారు. ఆటోమొబైల్‌, ఆరోగ్యం, ఏరోస్పేస్‌, రక్షణ, భారీయంత్రాల రంగంలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు.

అతిపెద్ద పరిశోధన, నైపుణ్యత కేంద్రంగా కర్ణాటక

కర్ణాటక అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సౌకర్యం, నైపుణ్యత కేంద్రంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి కేంద్రంగా కర్ణాటక రూపుదిద్దుకుంటుంది. 900కు పైగా జీసీసీ కేంద్రాలు ఉండగా అమెరికా తరువాత అతిపెద్ద గూగల్‌ సంస్థ క్యాంపస్‌ బెంగళూరులో ఉందన్నారు. గతేడాది ప్రధాని మోదీ వచ్చినప్పుడు బెంగళూరు ప్రపంచ నగరమని తెలిపారన్నారు. మనం ఏఐ రంగంలో ముందున్నామన్నారు. విద్యా రంగంలో ఏఐని వాడుతున్నాం, ఈ రాష్ట్రం మిమ్మల్ని స్వాగతిస్తోందన్నారు. మీరు ప్రగతి సాధించి రాష్ట్రం, దేశం ప్రగతి సాధించాలని, కంపెనీలు బలంగా ఉంటే మనం శక్తియుతంగా ఉంటామని, దేశమంతా ఒక్కటై పనిచేయాలని పిలుపునిచ్చారు.

దేశంలో ఏ ఇతర నగరాలూ సాటి రావు

సమ్మిట్‌లో ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

ప్రాథమిక విద్యకు సీఎస్‌ఆర్‌ నిధులు

ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌

ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక బృందం

శివాజీనగర: రాష్ట్రంలోని పరిశ్రమలు తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులను ప్రాథమిక విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి మరింతగా కేటాయించాలని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సీఎస్‌ఆర్‌ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుందన్నారు. కర్ణాటక వాణిజ్య, పరిశ్రమల సంస్థ ఏర్పాటు చేసిన ‘ గ్లోబల్‌ సీఎస్‌ఆర్‌ అండ్‌ సస్టెయినబిలిటీ సమ్మిట్‌–2026’ను ప్రారంభించిన తరువాత ఆయన మాట్లాడారు. మాజీ ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీని ప్రస్తావిస్తూ దేశంలో సీఎస్‌ఆర్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టిన ఘనత ప్రణబ్‌కే దక్కుతుందన్నారు. సీఎస్‌ఆర్‌ అనేది దాతృత్వం కాదు. అది సుస్థిర అభివృద్ధిలో పెట్టే పెట్టుబడి. బాధ్యతాయుతమైన చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.

ఆకట్టుకుంటున్న విద్యా వాతావరణం

రాష్ట్రంలో ప్రస్తుత పట్టణీకరణ 43 శాతంగా ఉందన్నారు. ఎస్‌ఎం కృష్ణ పరిపాలన హయాంలో 70 లక్షలుగా ఉన్న బెంగళూరు జనాభా నేడు సుమారు 1.4 కోట్లకు చేరుకుందన్నారు. రోడ్లపై 1.30 లక్షల వాహనాలు తిరుగుతున్నాయని ఆయన తెలిపారు. బెంగళూరు నగరంలోని విద్యా వాతావరణం ప్రపంచ నాయకులను ఆకర్షిస్తోందని అన్నారు. దేశంలోని 140 అంతర్జాతీయ పాఠశాలల్లో 38 కర్ణాటకలోనే ఉన్నాయి. రాష్ట్ర ఐటీ రంగంలో 26 లక్షల మంది ఉండగా, వారిలో 1.3 లక్షలు, అమెరికాలోని సుమారు 6 లక్షల మంది ఇంజనీర్లు కర్ణాటకకు చెందినవారేనన్నారు. రాష్ట్రంలోని 71 వైద్య కళాళాలల నుంచి ఏటా 13,900 మంది వైద్యులు, లక్షకు పైగా ఆరోగ్య కార్యకర్తలు పట్టభద్రులవుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 10,000 సీఎస్‌ఆర్‌ ప్రాజెక్టులు చురుకుగా పని చేస్తున్నాయన్నారు. వాటి పని తీరును మెరుగుపరచడానికి, అన్ని జిల్లాలకు విస్తరణకు ప్రత్యేక ప్రభుత్వ స్థాయి నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలి

కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని, మౌలిక సదుపాయాలను కల్పించాలి. నిధులు కేవలం భవన నిర్మాణానికే పరిమితం కాకూడదు. పిల్లలకు ప్రపంచ స్థాయిలో పోటీ పడగల విద్యను అందించడానికి నిపుణులైన మానవ వనరులు, ఉపాధ్యాయులను కూడా అందించాలన్నారు. దక్షిణ భారతదేశానికి ఇజ్రాయెల్‌ కౌన్సిల్‌ జనరల్‌ ఓర్లీ యూఎన్‌ కాంపాక్ట్‌ నెట్‌వర్క్‌ ఎగ్జిక్యూటివ్‌ గ్రూప్‌ చైర్మన్‌ విట్టిమాన్‌, లూథర్‌ ఇండియా డైరెక్టర్‌ రత్నాష్‌, ఎఫ్‌కేసీసీఐ సీఎంఎస్‌ఈఎం చైర్మన్‌ గిరీష్‌ లూథర్‌, కర్ణాటక ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధ్యక్షురాలు ఉమారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement