శివాజీనగర: కేపీసీసీ కార్యాలయం సమీపంలో బుధవారం బీజేపీ ఎమ్మెల్యేపై జరిగిన దాడిని ఖండిస్తూ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ప్రతిపక్ష నాయకులు ఆర్.అశోక్, చలువాది నారాయణస్వామిల నేతృత్వంలో ఎమ్మెల్యేలు గురువారం విధానసౌధ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేపై దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు పోస్టర్లు ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కొత్వాల్ ప్రభుత్వానికి ధిక్కారం’ , ‘గూండా ప్రభుత్వం’ అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో గూండాలు, కొత్వాల్ అనుచరుల ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతారని ఆయన హెచ్చరించారు. ధర్నాలో బీజేపీ శాసనసభా పక్ష ఉప నాయకుడు అరవింద బెల్లద్‌తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.


