దొడ్డబళ్లాపురం: నదిలో కొట్టుకుపోతున్న యువతిని ఒక యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈ ఘటన తాలూకాలోని నయానగర సమీపంలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ఒక యువతి బైలహొంగల సమీపంలో మలప్రభ నదిలో దూకింది. గమనించిన మల్లికార్జున అనే యువకుడు వెంటనే నదిలోకి దూకి ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. మల్లికార్జున ధైర్య సాహసాలను స్థానికులు కొనియాడారు. పోలీసులు అతన్ని అభినందించారు.
పెట్రోల్‌బాంబు వేయడానికొచ్చారు
బనశంకరి: కోడిగుడ్లు విసిరిన ఘటనపై కేపీసీసీ అధ్యక్షుడు బీకే.హరిప్రసాద్ తీవ్ర ఆరోపణ చేశారు. విపక్షనేత ఆర్.అశోక్ ఉన్న వాహనంలో నాటుబాంబు ఉందని, కేపీసీసీ కార్యాలయంపైకి పెట్రోల్ బాంబు వేయడానికి వచ్చారని ఆయన దుయ్యబట్టారు. ఉద్దేశపూర్వకంగా ఆర్.అశోక్ కేపీసీసీ కార్యాలయానికి బస్సును తీసుకువచ్చారన్నారు. ఎమ్మెల్యే బీపీ హరీశ్ కేపీసీసీ కార్యాలయానికి ఎందుకు వచ్చారు. 25 మంది విద్యార్థుల ఆత్మహత్యకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కారణం, మేం కాదని హరిప్రసాద్ మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే బీపీ.హరీశ్‌పై కోడిగుడ్లు విసిరిన ఘటనకు సంబంధించి మాట్లాడుతూ గుడ్లు వేసే సంస్కృతి ఎవరు ప్రారంభించారో తెలుసా? మడికేరిలో సిద్దరామయ్యపై కోడిగుడ్లు విసిరింది ఎవరు? ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్‌పై చెప్పులు విసిరింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.
పీజీలో పేలిన గ్యాస్ సిలిండర్
● 10 మందికి గాయాలు
బొమ్మనహళ్లి : పీజీ సెంటర్‌లో వంట గ్యాస్ సిలిండర్ పేలి పది మంది గాయపడ్డారు. ఈఘటన ఆనేకల్ తాలూకా బొమ్మసంద్రలో గురువారం చోటుచేసుకుంది. ఇక్కడ లింగరాజు అనే వ్యక్తి శ్రీ సాయి కంఫర్ట్ పేరుతో పీజీ నిర్వహిస్తున్నాడు. ఇందులో 18 గదులు ఉన్నాయి. భవనం రెండో అంతస్తులో వంటగది ఉంది. ఈ పీజీలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికులు నివాసం ఉంటున్నారు. వీరంతా స్థానిక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం వంట గదిలో లైట్ వేయగానే భారీ శబ్దంతో సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. పేలుడు తీవ్రతకు తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. మంటలు వ్యాపించడంతో సౌరవ్ చౌదరి, అలావుద్దీన్, శాంతనురై, అభిబుల్ రెహమాన్, సుబ్రతా బేరా, దేబాశిష్ హల్దార్ సహా 10 మంది కార్మికులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. హెబ్బగోడి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


