హుబ్లీ: కొప్పళ జిల్లా యలబుర్గా అసెంబ్లీ నియోజకవర్గంలో విండ్ పవర్, సోలార్ ప్రాజెక్టులు, కేపీటీసీఎల్ విద్యుత్ సబ్‌స్టేషన్లకు భూముల స్వాధీనం ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. రైతులు భూములు ఇవ్వకూడదంటూ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి చెబుతుండగా.. ఆయన ఆప్తుడు నవళి హిరేమఠ్ రైతులతో ల్యాండ్ డీలింగ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎస్‌ఆర్ నవళి హిరేమఠ్ యలబుర్గ ప్రాంత రైతులతో సమావేశమై.. కేపీటీసీఎల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌పై చర్చించారు. మీరు ఎకరాకు రూ.40 లక్షలు అడుగుతున్నారు. అయితే రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల కుదురవచ్చని రేట్ ఫిక్స్ చేస్తున్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ ఘటనతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. 770 మోగావాట్ల విద్యుత్ కేంద్ర యోజనకు సంబంధించి భూమి కొనుగోలు నిలపాలని జిల్లా అధికారికి లేఖ రాశారు.
కుమారుడిపై
అత్యాచారం కేసు
● మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
రాయచూరు రూరల్: కుమారుడిపై అత్యాచారం కేసు నమోదు కావడంతో మనస్తాపానికి గురైన తల్లి విష ద్రావకం సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సింధనూరు తాలూకా బోగాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. సింధనూర్ తాలూకా బోగాపూర్‌లో గంగమ్మ (60), ఆమె కుమారుడు గంగప్ప నివసిస్తున్నారు. గంగప్ప గ్రామంలో ఓ మహిళపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో తుర్విహల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయాన్ని తలుచుకుని తల్లి గంగమ్మ మానసికంగా కుంగిపోయింది. అత్యాచారానికి గురైన మహిళ కుటుంబ సభ్యులు ఇటీవల గంగప్ప నివాసానికి వెళ్లి దాడి చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పరువు పోయిందని మనస్తాపం చెందిన గంగమ్మ.. విషద్రావకం సేవించి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ వెల్లడించారు.
ప్రాణహాని ఉందని ఫిర్యాదు
హోసూరు: ఆస్తి తగాదాల్లో మహిళలపై దాడి చేసి, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు సోమవారం ఉదయం హోసూరు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. చెన్నత్తూరు పంచాయతీ కసవుగట్ట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి కొడుకు మల్లేష్‌రెడ్డికి, బంధువు నరసింహారెడ్డి కొడుకు నరేంద్ర, పిల్లారెడ్డి కొడుకు జయరామరెడ్డి మధ్య గొడవలు ఉన్నాయన్నారు. నరేంద్ర, జయరామరెడ్డి నుంచి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.


