శివాజీనగర: దేశవ్యాప్తంగా ఈసీ చేపట్టిన సర్ ప్రకంపనలు సృష్టించడం తెలిసిందే. ప్రతి ఓటరును జాబితాలో నమోదు చేయడం, అలాగే నకిలీ ఓటర్లను, అక్రమాలను తొలగించడమే లక్ష్యమని ఈసీ చెబుతోంది.
ఇంటింటికీ వెళ్లి తనిఖీలు
కర్ణాటకతో పాటుగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక పరిష్కరణ (సర్) నిర్వహణకు ఎన్నికల కమిషన్ సంసిద్ధమైంది. ఇది జూన్ 20 నుంచి ఆరంభం కానుండగా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో సుమారు 5.5 కోట్ల ఓటర్లు ఉన్నారు. వేలాది బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలు నియమించిన ఏజెంట్ల సహకారంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను తనిఖీ చేస్తారు. అవకతవకలు ఉన్నట్లు తేలితే ఓటర్లను తక్షణం తొలగించే అవకాశముంది. మరణించిన ఓటర్లు, రెండు మూడు సార్లు నమోదైన పేర్లు తదితరాలను పరిశీలిస్తారు. అయితే ఓటర్లను విచక్షణా రహితంగా తొలగించే ప్రమాదముందని కాంగ్రెస్ నేతలు ముందు నుంచీ ఆరోపిస్తున్నారు.
కర్ణాటకలో ఎప్పుడు?
కర్ణాటకలో ప్రక్రియ ఇలా సాగుతుంది... జూన్ 20 నుంచి 29 వరకు ఏర్పాట్లు, సిబ్బందికి శిక్షణ, కాగితాల ముద్రణ జరుగుతుంది. జూన్ 30 నుంచి జూలై 29 వరకు బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తారు. ఆగస్టు 5న సవరించిన ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఓటర్లు, పార్టీలు అభ్యంతరాలను సమర్పించవచ్చు. అక్టోబరు 3 వరకు వీటిని పరిష్కారం నిర్వహించి, తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 7న ప్రకటిస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి.
ముమ్మరంగా ఏరివేతలుంటాయా?
జూన్ 20 నుంచి ఓటర్ల ప్రత్యేక పరిష్కార ప్రక్రియ
పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన సర్


